ఐదు రోజుల పాటు బాత్‌రూమ్‌లోనే..

11 Sep, 2022 10:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఐదు రోజుల పాటు బాత్‌రూమ్‌లోనే ఆ వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడి వరకు వచ్చి పనిచేసుకుంటున్న ఆ మనిషి చనిపోయిన సంగతి ఐదు రోజుల తర్వాత అందరికీ తెలిసింది. టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి స్థానిక పాతజాతీయ రహదారి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఇంటిలో ఐదు రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతుడు తమిళనాడుకి చెందిన గోవిందన్‌ వేణుగోపాల్‌ (54)గా గుర్తించారు. అతను హడ్డుబంగి గ్రామ సమీపంలో గల మార్గర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్వారీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ క్వారీ కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి వేణుగోపాల్‌ రూమ్‌లోనే ఉండేవారు. అప్పుడప్పుడు క్వారీకి వెళ్లి వచ్చేవారు. అయితే ఐదు రోజులుగా క్వారీకి రావడం లేదని అక్కడి వాచ్‌మెన్‌ తెలిపారు. వినాయక చవితి రోజున ఆరోగ్యం సరిగా లేదు రానని వాచ్‌మెన్‌కు వేణుగోపాల్‌ చెప్పారు. ఈ నెల 2న ఇంటి అద్దెను కూడా చెల్లించారు. అప్పటి నుంచి ఆయన కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని ఇంటి యజమాని అనుకున్నారు. శనివారం వేణుగోపాల్‌ ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని వెళ్లి చూశారు. బాత్‌రూమ్‌లో వేణుగోపాల్‌ మృతదేహం కనిపించడంతో నిశ్చేష్టుడైపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అతను మరణించి ఐదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. మృతుడు ఒక్కడే ఇంటిలో ఉండడంతో అతను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదని చెప్పారు. 

చదవండి: మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య 

మరిన్ని వార్తలు