కళగం వార్‌: అర్ధరాత్రి మన్నడిలో ఉద్రిక్తత 

15 Jul, 2021 07:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: రాజకీయబలాన్ని చాటుకునేందుకుగాను కళగంను కైవశం చేసుకునే రీతిలో మైనారిటీ నేతల మధ్య మంగళవారం అర్ధరాత్రి వివాదం రగిలింది. చెన్నై మన్నడిలో ఇరువర్గాల మధ్య ఘర్షణతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం(తముముక) కు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జవహరుల్లా వ్యవహరిస్తున్నారు. జవహరుల్లా నేతృత్వంలో మనిద నేయ మక్కల్‌ కట్చి పేరిట పార్టీ సైతం రాజకీయ తెరపై ఉంది. డీఎంకే కూటమిలో ఈ కట్చి ఉంది. తమముక ప్రధాన కార్యదర్శిగా ఉన్న హైదర్‌ అలీని ఇటీవల తొలగించారు. దీంతో ఆయన కళగంను కైవశం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.  ఆ కళగం జెండా, పేరును వాడుకునేందుకు హైదర్‌ అలీకి కోర్టులో చుక్కెదురైంది. ఈపరిస్థితుల్లో తమిళనాడు ముస్లీం మున్నేట్ర కళగంను అనుసరించే రీతిలో ‘తముముకా’ పేరిట హైదర్‌ అలీ పార్టీని ప్రకటించారు. ఆ కళగం కార్యాలయానికి సమీపంలో తన కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. తముముకా కార్యాలయాన్ని, బోర్డుల్ని తొలగించేందుకు కళగం వర్గం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. 

అర్ధరాత్రి ఉద్రిక్తత.... 
కళగం వర్గాలు తమ కార్యాలయం వైపుగా దూసుకురావడంతో హైదర్‌ అలీ వర్గం అడ్డుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితి అదుపులోకి వచ్చినా ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. రా›త్రి జరిగిన ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది అక్కడి కార్యకర్తల ఆక్రోశం అని బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ముస్లింమున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి హాజాఖని తెలిపారు. 

మరిన్ని వార్తలు