తమ్మినేని కృష్ణయ్య పాత వీడియో వైరల్‌.. పీక కొరుకుతానని హెచ్చరించిన ప్రత్యర్థులు

19 Aug, 2022 15:36 IST|Sakshi

సాక్షి, ఖమ్మం రూరల్‌: తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్యకు ముందే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో కృష్ణయ్యను పీక కొరికి చంపుతా అంటూ ప్రత్యర్థులు హెచ్చరించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఏడాదిన్నర క్రితం జరిగిన గ్రామసభలో కృష్ణయ్యకు–ప్రత్యర్థులకు నడుమ ఘర్షణ జరిగింది. ఇందులో ప్రత్యర్థులు చంపుతానని బెదిరించగా, ‘నేను ఎవరికీ భయపడేది లేదు, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమే, నన్ను ఎవరైనా చంపొచ్చు లేదా యాక్సిడెంట్‌ రూపంలో చావచ్చు లేదా కాల్వలో పడి చావొచ్చు.. చావుకు భయపడే పిరికి వాడిని కాదు’ అన్న మాటలే నేడు నిజమయ్యాయని వీడియో చూసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. 

కాగా ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. అయితే ఈ వీడియో ఆధారంగా రాజకీయ కోణంలోనే కృష్ణయ్య హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్‌.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు