నేరేడ్‌మెట్‌: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం

29 Jun, 2021 18:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టాంజానియా యువతీ, యువకుడి అరెస్టు

ముగిసిన వీసా గడువు 

నేరేడ్‌మెట్‌లో వ్యభిచార గృహంపై ఎస్‌ఓటీ దాడులు

సాక్షి, నేరేడ్‌మెట్‌: వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉంటూ డబ్బుల సంపాదన కోసం ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న టాంజానియా దేశానికి చెందిన యువతీ, యువకుడు కటకటాలపాలయ్యారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా చేసిన డెకాయ్‌ ఆపరేషన్‌లో ఆన్‌లైన్‌ వ్యభిచార కార్యకలాపాల గుట్టు రట్టు అయింది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా దేశానికి చెందిన యువతి(24), ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్‌(24) ఉన్నత విద్యనభ్యసించేందుకు గత ఏడాది జనవరిలో స్టడీ వీసాపై భారత్‌కు వచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సును పూర్తి చేశారు. వీసా గడువు ముగిసినా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓలో రెన్యూవల్‌ చేసుకోలేదు. కొంత కాలంపాటు తార్నాకలో నివసించిన వీరద్దరు రెండు నెలల క్రితం నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని జీకే కాలనీకి మకాం మార్చారు. భార్యాభర్తలుగా చెప్పుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మీట్‌–24 యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నిర్వాహకురాలు/బాధితురాలైన యువతి తన అర్ధనగ్న ఫొటోలను అప్‌లోడ్‌ చేస్త తద్వారా కస్టమర్లను ఆకర్షించేది. తరువాత యాప్‌ ద్వారా చాటింగ్‌ చేసిన కస్టమర్లకు తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇచ్చి, వారితో శృంగార సంభాషణ చేస్తూ ఇంటికి ఆహ్వానిస్తుంది.

తరువాత వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్‌లు సహకరిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ ఆన్‌లైన్‌ వ్యభిచార గుట్టును రట్టు చేశారు. సోమవారం పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. రెండు సెల్‌ఫోన్లు, పాస్‌పోర్టులను పోలీసులు సీజ్‌ చేశారని సీఐ చెప్పారు.

చదవండి: వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్‌

మరిన్ని వార్తలు