బీదర్‌ నుంచి వస్తున్న ‘రాణి’

16 Oct, 2020 08:53 IST|Sakshi

ఆ బ్రాండ్‌ గుట్కా అక్రమ రవాణా, విక్రయం 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగుతున్న దందా 

ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ 

రూ.63 లక్షల గుట్కాతో పాటు వాహనం సీజ్‌  

సాక్షి, సిటీబ్యూరో: ‘రాణి’ బ్రాండ్‌ గుట్కాను వక్కల ముసుగులో కర్ణాటకలోని బీదర్‌  నుంచి నగరానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు సిటీలో దొరికిన నిషేధిత పొగాకు ఉత్పత్తులన్నీ పాన్‌ మసాలా, తంబాకు విడివిడిగా ప్యాక్‌ చేసి ఉన్నవే కాగా.. తొలిసారిగా పూర్తి గుట్కాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి గురువారం తన కార్యాలయంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరులకు తెలిపిన వివరాలు ప్రకారం... 
(చదవండి: కూకట్‌పల్లిలో దారుణం)

► నగరానికి చెందిన అన్నదమ్ములు మహ్మద్‌ హసనుద్దీన్, మహ్మద్‌ మజారుద్దీన్, మహ్మద్‌ ఆరీఫ్‌  వ్యవస్థీకృత  గుట్కా దందా ప్రారంభించారు. తమకు సహకరించడానికి అక్తర్, యాసీన్, మక్బూల్, దస్తగిరి, మీర్జా ఫజీ హుస్సేన్‌ బేగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. 
► అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో ఈ ముఠాలో కొందరు గోదాముల ఇన్‌చార్జ్‌లుగా, మరికొందరు ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. బీదర్‌కు చెందిన రిజ్వాన్‌ ఈ ముఠాకు హోల్‌సేల్‌గా రాణి బ్రాండ్‌ గుట్కాను సరఫరా చేస్తున్నారు.  
► వక్కల పేరుతో డీసీఎం వ్యాన్లలో బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గుట్కా వివిధ గోదాములకు చేరుతోంది. అక్కడ నుంచి దీన్ని చిన్న చిన్న వాహనాల్లో పాన్‌షాపులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మొత్తం ట్రాన్స్‌పోర్ట్, కొరియర్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాలకు వెళ్తోంది.  
► పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి బీదర్‌ నుంచి సిటీలో గుట్కా దిగిన తర్వాత ఒకే గోదాములో ఉంచట్లేదు. నిత్యం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నారు. ఈ గ్యాంగ్‌ ఇటీవలే బహదూర్‌పుర పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఓ గోదాము అద్దెకు తీసుకుంది. 
► ఈ వ్యవహారంపై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌  తమ బృందాలతో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు.  
► మీర్జా, దస్తగిరిలను అరెస్టు చేసి వీరి నుంచి వాహనంతో పాటు రూ.63,96,000 విలువైన 31 బ్యాగుల్లో ఉన్న 639600 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 
► నగరంలో ఉన్న కొరియర్, ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలు ఇలాంటి నిషేధిత ఉత్పత్తుల్ని రవాణా చేయవద్దని, అలా చేస్తే వారి పైనా కేసులు పెడతామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు.  
► ఈ కార్యక్రమంలో నగర కొత్వాల్‌ సిటీలోని గస్తీ వాహనాల సిబ్బందికి రిఫ్లెక్టివ్‌ జాకెట్లు పంపిణీ చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్న వీరే పోలీసు విభాగానికి బ్రాండ్‌ అంబాసిడర్లని అన్నారు.  
(చదవండి: 300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు)

మరిన్ని వార్తలు