ఐదుగురు అనుచరులతో ‘ఆవుల’ స్కెచ్‌

24 Jun, 2022 02:33 IST|Sakshi

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి తెరవెనక ఉండి కుట్ర

నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

తదుపరి చర్యల కోసం రైల్వే పోలీసులకు అప్పగింత

విధ్వంసంలోపాస్‌పోర్టులు, కీలక పత్రాలు దగ్ధం

సాక్షి,హైదరాబాద్‌: ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు తన అనుచరులతో కలసి ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను రెచ్చగొట్టడం ద్వారా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి ప్రేరేపించినట్లు తేలింది. సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ సహా ఐదుగురు కీలక నిందితులను పట్టుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం వారిని సికింద్రాబాద్‌ గవర్నమెంట్‌ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించారు.

వీరిని విచారిస్తున్న అధికారులు శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. అగ్నిప«థ్‌ పథకం ప్రక టనతోనే భారీ ఆందోళనలకు పథకం వేసిన సుబ్బారావు, వీలున్నంత వరకు తన పేరు బయటకు రాకుండా ఉండాలని భావించాడు. దీంతో తన అకాడమీలకు డైరెక్టర్లుగా, ఇన్‌స్ట్రక్ట ర్లుగా ఉన్న ఐదుగురిని రంగంలోకి దింపాడు. వీరిలో మల్లారెడ్డి, శివ కీలకమని పోలీసులు చెప్తున్నారు.

వీరి ద్వారానే తమ అకాడమీలతోపాటు ఇతర ఇన్‌స్టిట్యూట్లలో శిక్షణ తీసుకుంటున్న ఆర్మీ ఉద్యోగార్థులను సంప్రదించడం, రెచ్చగొట్టడం వంటివి చేశాడు. తాను బోడుప్పల్‌లోని అకాడమీలో ఉండి అనేకమందిని హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఉంచాడు. నాగోలు మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసిన మల్లారెడ్డి.. విధ్వంసం జరిగిన రోజు అభ్యర్థులకు సహాయసహకారాలు అందించాడు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఇస్తానం టూ సుబ్బారావు చెప్పాడని.. ఇలా పలువురిని విధ్వంసానికి ప్రేరేపించాడని జీఆర్పీ పోలీసులు గుర్తించారు.

రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంతో రైల్వే, ప్రైవేట్‌ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు అనేక మంది పాస్‌పోర్టులు, విలువైన పత్రాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఆందోళన జరిగిన రోజు ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రైల్వే మెయిల్‌ సర్వీస్‌ కోచ్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అందులో ఉన్న తపాలా శాఖకు చెందిన 400 బ్యాగులు దగ్ధమయ్యాయి. వీటిలో 173 పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఆయా వ్యక్తులకు బట్వాడా కావాల్సిన ఎల్‌ఐసీ బాండ్లు, విద్య, ధ్రువపత్రాలు బుగ్గిపాలయ్యాయి. ఈ క్రమంలో పోస్టల్‌ అధికారులు.. దీని ప్రభావం సామాన్యులపై లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు.

మరిన్ని వార్తలు