అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం

3 Sep, 2020 09:23 IST|Sakshi
నిందితుడు రమేశ్‌

సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్‌లో కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన దోమల రమేశ్‌(30)ని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్‌లోని డీసీఎంఎస్‌ కాంప్లెక్స్‌లో సివిల్‌ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్‌ కోర్టు విజిలెన్స్‌ అధికారిగా తనను వరంగల్‌ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్‌ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్‌ సివిల్‌ కోర్టు జ్యుడిషియల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు.

రూ.4 కోట్ల వసూళ్లు
జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్‌ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్‌ఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్‌ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు.

గోదావరిఖనిలో స్క్రాప్‌ బిడ్డింగ్‌ తనకే వచ్చిందని, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అథారిటీ రీజనల్‌ కార్యాలయం ద్వారా రూ.5.34 కోట్లు వచ్చాయని, వరంగల్‌ జిల్లా జడ్జి తనకు జ్యుడిషియల్‌ ఆఫీసర్‌గా జీతం ఇస్తున్నట్లు రూ.2.75 లక్షల ఫేక్‌చెక్, జూనియర్‌ లెక్చరర్‌గా మంచిర్యాలలో అపాయింట్‌ అయినట్లు ఫేక్‌ అపాయింట్‌మెంట్, ఆర్‌బీఐ అకౌంట్‌ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు ఫేక్‌ లెటర్, గోదావరిఖనిలోని ఎస్‌బీఐ(అప్పటి ఎస్‌బీహెచ్‌) బ్యాంకు అకౌంట్‌లో కోటి ఉన్నట్లు తప్పుడు పత్రం, జేపీహెచ్‌ఎస్‌ రామకృష్ణపూర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సాలరీ సర్టిఫికెట్, ఐడీకార్డులు తయారు చేసి రూ.4కోట్లు వసూలు చేయగా రెండున్నర కోట్లు జల్సాలకే ఖర్చుచేసినట్లు , మిగతా ఒకటిన్నర కోటి పలువురి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.  

మోసం చేసి రెండోపెళ్లి..విడాకులు
2011లో గోదావరిఖనికి ఎలకపల్లికి చెందిన యువతిని ప్రే మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా 2014 మే 18న కేశవపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన అ మ్మాయిని రెండోవివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చి న రెండో భార్య కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా రమేశ్, అతడి కుటుంబసభ్యులను అరెస్టు చేయగా తర్వాత రెండోభార్య రమేశ్‌తో విడాకులు తీసుకుంది.  

పక్కా ప్రణాళికతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
దోమల రమేశ్‌ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత  సమాచారంతో ఎల్‌ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ రష్మిపెరుమాల్, టాస్క్‌ఫోర్స్‌ సీఐలు ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు