రాయితో మోది.. కత్తితో దాడి చేసి..

11 Apr, 2021 10:05 IST|Sakshi
టీడీపీ కార్యకర్త దాడిలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త రావాడ సత్తిబాబు- కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జిగటాల గణేష్‌ 

ఇద్దరికి గాయాలు

భీమవరపుకోటలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన  

కోటనందూరు: మండలంలోని భీమవరపుకోట గ్రామంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇరుపక్షాల మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ వర్గీయులు ముగ్గురు రాళ్లు, కత్తితో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేసి, గాయపరిచారు. పరిషత్‌ ఎన్నికలు జరిగిన రోజు రాత్రి ఈ దాడి జరిగింది. స్థానికులు, కోటనందూరు పోలీసుల కథనం ప్రకారం.. భీమవరపుకోటకు చెందిన సహకార బ్యాంక్‌ డైరెక్టర్, వైఎస్సార్‌ సీపీ కార్యకర్త రావాడ సత్తిబాబు గత గురువారం స్థానిక ఎస్సీ పేటలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద కూర్చొని సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తున్నా కొంతమంది అన్యాయం చేస్తున్నారని తనలో తను అనుకుంటున్నాడు. అదే సమయంలో టీడీపీ కార్యకర్త దండా కుమార్‌ అటు గా వెళ్తున్నాడు.

సత్తిబాబు తననుద్దేశించే అలా అంటున్నాడని భావించి, అతడితో వివాదానికి దిగి, రాయితో మోదాడు. తలపై తీవ్ర గాయమై, రక్తస్రావం కావడంతో సత్తిబాబు తన వర్గీయులు జిగటాల గణేష్, రావాడ నూకరాజుతో పాటు మరికొంతమందిని పిలిచాడు. రాయితో మోదిన కుమార్‌ కూడా తన సోదరుడు రావాడ రాజుతో పాటు మరికొంతమందిని పిలిచాడు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గొడవకు కారణమైన దండా కుమార్‌ సో దరుడు, టీడీపీ కార్యకర్త దండా రాజు.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త జిగటాల గణేష్‌ మెడపై కత్తితో నరికేందుకు ప్రయత్నించాడు.

తప్పించుకున్న గణేష్‌కు కుడి చెవి వెనుక భాగంలో బలమైన గాయమైంది. ఈ దాడిలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు రావాడ సత్తిబాబు, రావాడ నూకరాజు, జిగటాల గణేష్‌లను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రావాడ సత్తిబాబు, రావాడ నూకరాజులను వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. చెవికి బలమైన గాయమైన జిగటాల గణేష్‌ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ దాడికి సంబంధించి రావాడ సత్తిబాబు శనివారం కోటనందూరు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలు దండా కుమార్, దండా రాజుతో పాటు మరో ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశాడు. నిందితులపై కోటనందూరు ఎస్సై ఎం.అశోక్‌ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదవండి:
టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!

మరిన్ని వార్తలు