మేం చెప్పినట్లుగానే కేసు కట్టాలి.. కేకలు.. అరుపులతో హంగామా.. 

12 Nov, 2021 08:00 IST|Sakshi
టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో హంగామా చేస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు

సాక్షి, అనంతపురం: నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సీపీఐ, టీడీపీ నాయకులు హైడ్రామాకు తెరలేపారు. తమ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టి వాగ్వాదానికి దిగారు. తాము సూచించిన సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో స్టేషన్‌ ఎదుట నానా రభస చేశారు. వివరాలు...  

ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన.. 
నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు గురువారం ఆ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 8న జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 30 యాక్ట్‌ అమలులో ఉండడంతో ఆందోళన విరమించాలని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్ట్‌ చేసి, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మనోహర్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.  

కేకలు.. అరుపులతో హంగామా.. 
ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల అరెస్ట్‌ విషయం తెలుసుకున్న సీపీఐ, టీడీపీ నాయకులు వెనువెంటనే రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను చేరుకున్నారు. తమ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్‌ కింద కేసులు ఎలా నమోదు చేస్తారంటూ సీపీఐ నేత యల్లుట్ల నారాయణస్వామి, టీడీపీ నగర అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, నరసింహులు తదితరులు పోలీసులను ప్రశ్నించారు.

సీఐలు ప్రతాప్‌రెడ్డి, జాకీర్‌హుస్సేన్, రెడ్డెప్ప, కత్తి శ్రీనివాసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే గట్టిగా కేకలు, అరుపులతో హంగామాకు తెరలేపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఏకవచనంతో సంభోధిస్తూ తాము చెప్పిన సెక్షన్ల మేరకే కేసు కట్టాలంటూ డిమాండ్‌ చేశారు. రూల్‌ ధిక్కరించడం సబబు కాదని ఈ విషయంగా అనవసర రాద్ధాంతం వద్దని డీఎస్పీ నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తే వారు ససేమిరా అంటూ నానా రభస చేశారు.

చివరకు పార్టీ నేతలను డీఎస్పీ బయటకు పంపి 30 యాక్ట్‌ ధిక్కరించిన  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు పరుశురాం, గుత్తా ధనుంజయనాయుడు,  ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు మనోహర్, కుళ్లాయస్వామి, వంశీ, పృథ్వీ, రమణయ్య, ఉమామహేష్, రవి, రాజేంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు.  
టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో హంగామా చేస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు  

మరిన్ని వార్తలు