Hyderabad: లక్షల్లో కోడిపందాలు బెట్టింగ్‌.. పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని

7 Jul, 2022 11:23 IST|Sakshi

పరారైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌  

పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల ఫాంహౌస్‌లో ఘటన

పటాన్‌చెరు: కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చేసిన దాడిలో ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి కోళ్ల పందేలు ఆడుతున్న వారిని పట్టుకున్నారు.

మొత్తం 70 మంది వరకు పందెం ఆడుతున్నట్లు పోలీసులు లెక్కతీశారు. అయితే పోలీసులు ఫా మ్‌హౌస్‌లోకి వెళ్తుండగానే కొందరు పరారయ్యా రు. చింతమనేని ప్రభాకరే కోళ్ల పందేన్ని నిర్వహిస్తున్నారని పటాన్‌చెరు పోలీస్‌ డివిజనల్‌ అధికారి(డీఎస్పీ) భీమ్‌రెడ్డి తెలిపారు. చింతమనేనితో పాటు అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల శ్రీను నిర్వాహకులని చెప్పారు. సతీష్, బర్ల శ్రీనును అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులకు 22 మంది దొరకగా.. 25 వాహనాలు, 24 సెల్‌ఫోన్లు, రూ.13,12,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. 31 కోళ్లు, 31 చిన్న కత్తులు లభించాయి. 

పోలీసుల అదుపులో పందెం రాయుళ్లు

మరిన్ని వార్తలు