పేరుమార్చి నాపై టీడీపీ తప్పుడు ప్రచారం

21 Oct, 2021 03:16 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి విభాగం నేత రియాజ్‌ ఆవేదన

నంద్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు 

నంద్యాల: సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యార్థి విభాగం నాయకుడు షేక్‌ రియాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నంద్యాలలో నివాసం ఉంటున్నానని, పార్టీలకతీతంగా పనిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి విభాగంలో పదేళ్లుగా కర్నూలు జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నానని చెప్పారు. అయితే తన పేరును పొదిలి శివమురళిగా మార్చి ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసు వేసింది ఇతడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

విద్యారంగ సమస్యలపై 2017లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన సందర్భంలో సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టానని, ఆ సెల్ఫీని చూపుతూ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని చూసి ఇళ్ల స్థలాలు ఆపాలని ఎందుకు కేసు వేశావంటూ తనకు రోజూ వందలాది ఫోన్లు వస్తున్నాయన్నారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తానెందుకు వద్దంటానని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు తనను క్షోభకు గురి చేస్తున్నారన్నారు.

టీడీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాను నారా లోకేష్, పవన్‌ కల్యాణ్, చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, నాదెళ్ల మనోహర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా ఫొటోలు దిగానన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడటం పద్ధతి కాదన్నారు. కాగా, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థి నేత రియాజ్‌పై టీడీపీ నిందలు వేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.    

మరిన్ని వార్తలు