లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా? 

24 Apr, 2022 07:35 IST|Sakshi
జొన్నా రామయ్యకు వ్యతిరేకంగా లాడ్జి ముందు రాళ్లు కుప్పగా వేసిన జొన్నా సోదరులు  

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరును విమర్శిస్తున్న సోదరులు 

లాడ్జి వ్యవహారంలో ముదిరిన వివాదం

రామయ్యకు మద్దతుగా నిలిచిన టీడీపీ నేత కందికుంట

కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్‌ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్‌ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్‌ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్‌ చేయించారు.

చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే..

అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్‌ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది.

కుటుంబానికి చెడ్డపేరు రాకుండా..  
రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు.

కందికుంట తీరుపై ప్రజల అసహనం
లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట   వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు