మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు మృతి

17 Jul, 2022 05:30 IST|Sakshi
ఘటనా స్థలంలో క్షతగాత్రులు, మోపెడ్‌

మరో మహిళకు తీవ్ర గాయాలు

శాంతిపురం(చిత్తూరు): మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు గౌనివారి శ్రీనివాసులు కారు ఢీకొని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బంగారుపేట సమీపంలో ఉన్న ఐతెనహళ్లికి చెందిన దంపతులు మునెప్ప (60), లక్ష్మమ్మ శనివారం మోపెడ్‌పై గుండిశెట్టిపల్లికి బయలుదేరారు.

గమ్యస్థానానికి అర కిలోమీటరు దూరంలో ఉండగా శనివారం రాత్రి పలమనేరు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు వీరి టీవీఎస్‌ సూపర్‌ ఎక్సెల్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ మునెప్పకు తల, కాళ్లకు, లక్ష్మమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

108 వాహనంలో వీరిని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు స్వయంగా కారు నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే రాత్రి 9.30 గంటల వరకు ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఈ విషయమై రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మునిస్వామిని వివరణ కోరగా..ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం. ఒక ప్రాణం పోయినా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా.. ప్రమాదానికి కారణం ఎవరనే విషయంలో స్పష్టత ఉన్నా పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. 

మరిన్ని వార్తలు