పోలీసులు భోజనం చేస్తున్నారు.. టౌన్‌లోకి వచ్చేయండి

30 May, 2022 03:43 IST|Sakshi
కోనసీమలో విధ్వంసం వెనుక వాట్సాప్‌ గ్రూప్‌లలో, వీడియోల్లో పట్టుబడిన నిందితులు

3.10కి స్టార్ట్‌ యుద్ధం

ఇదీ అమలాపురం విధ్వంసం కుట్ర

వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలతో కుట్ర అమలు

విధ్వంసకాండలో క్రియాశీలకంగా టీడీపీ, జనసేన నేతలు 

ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్ర బట్టబయలు.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

సాక్షి, అమరావతి: ‘పోలీసు వారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అమలాపురం టౌన్‌లోకి రాడానికి..’ ఇది అమలాపురంలో అల్లరి మూకలు విధ్వంసకాడకు పాల్పడిన ఈ నెల 24న కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయిన సందేశం. 

‘కరెక్టుగా 3.10 నిమిషాలకే స్టార్ట్‌ యుద్ధం..’
ఆ వాట్సాప్‌ గ్రూపుల్లో మరో పోస్టు ఇది. అంతేకాదు.. ఏబీఎన్‌ చానల్‌లో ఆ ర్యాలీ, విధ్వంసానికి సంబంధించి లైవ్‌ వీడియో క్లిప్పింగులను కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తూ అల్లరి మూకలను నడిపించారు. 

అమలాపురం విధ్వంసం వెనుక ఎంతటి పకడ్బందీ కుట్ర ఉందన్నది ఈ వాట్సాప్‌ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల కనుసన్నల్లో అల్లర్లకు ఎంత పక్కాగా పన్నాగం పన్నారన్నది తేటతెల్లమవుతోంది. దీంతో విధ్వంసం వెనుక ఆ రెండు పార్టీల కుట్ర మరింతగా బట్టబయలవుతోంది. 

ఆ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడిపించిన కుట్ర కథలో పాత్రధారులైన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వివరాలు ఆధారాలతోసహా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విధ్వంసానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగులను పరిశీలించి దాదాపు 1,500 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, వీడియో రికార్డింగులతోపాటు పోలీసు టెక్నాలజీ విభాగం నిందితులు, అనుమానితుల వాట్సాప్‌ సందేశాలు, కాల్‌డేటాలను పరిశీలిస్తుండగా విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్ర వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్రపన్నాయన్నది తెలుస్తోంది. 

వాట్సాప్‌ సందేశాలతో కుట్ర
అమలాపురంలో దాడులకు ప్రేరేపించిన దాదాపు 15 వాట్సాప్‌ గ్రూపులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 24న చలో కలెక్టరేట్‌ ర్యాలీ సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలక నేతలు ఎప్పటికప్పుడు కుట్ర రచించారన్నది స్పష్టమైంది. రిమోట్‌ కంట్రోల్‌ నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందేశాల ప్రకారం ఆ వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేస్తూ అల్ల్లర్లకు పన్నాగం పన్నారు. 3.10 గంటలకు విధ్వంసానికి పాల్పడాలని ఆ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా అల్లరి మూకలను ముందుగానే సిద్ధం చేశారు.

అంతేకాదు.. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ బయట నుంచి రప్పించిన అల్లరి మూకలు అమలాపురంలో రహస్య ప్రదేశాల్లో మాటువేశాయి. ర్యాలీలో ఉన్న కుట్ర సూత్రధారులు మొత్తం పరిణామాలను పరిశీలిస్తూ ఆ అల్లరి మూకలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు. పోలీసులు మధ్యాహ్నం భోజనాలు చేస్తుండటాన్ని గుర్తించిన సూత్రధారులు వెంటనే అల్లరి మూకలకు సమాచారం అందించారు. ఆ సమయంలో అమలాపురంలోకి ప్రవేశించాలని చెప్పారు.

అమలాపురంలో పరిస్థితిని బయట మాటేసి ఉన్న అల్లరి మూకలకు వివరించేందుకు ఏబీఎన్‌ టీవీ చానల్‌లో లైవ్‌ న్యూస్‌ను ఆధారంగా చేసుకున్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో వివిధచోట్ల పరిస్థితి, ఇతర అంశాలను ఆ చానల్‌ లైవ్‌ న్యూస్‌లో ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది. కుట్ర సూత్రధారులు ఆ చానల్‌ ప్రసారం చేస్తున్న లైవ్‌ న్యూస్‌ వీడియో క్లిప్పింగులను కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేస్తూ వాటిపై.. పోలీసులు భోజనాలు చేస్తున్నారు వెంటనే టౌన్‌లోకి వచ్చేయండి అని సందేశాలు పెట్టడం గమనార్హం.

ఆ పథకం ప్రకారమే అల్లరి మూకలు ఒక్కసారిగా చేతిలో పెట్రోల్‌ బాంబు సీసాలు, రాళ్లతో అమలాపురంలోకి చొరబడి విధ్వంసానికి తెగించాయి. బస్సులను దహనం చేసిన అనంతరం ముందస్తు కుట్రలో భాగంగానే మంత్రి విశ్వరూప్‌ క్యాంప్‌ కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న నివాసంతోపాటు ఎమ్మెల్యే సతీష్‌ నివాసంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు గుర్తించడం ఈ కేసులో కీలక పరిణామం.

ఇదిగో టీడీపీ, జనసేన నేతలు
టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు దగ్గరుండి అమలాపురంలో విధ్వంసాన్ని కొనసాగించారడానికి మరికొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ రెండు పార్టీల నేతలు విధ్వంసంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఫొటోలను పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన పితాని దుర్గాప్రసాద్, సంగడి ఆనందబాబు, జనసేన పార్టీకి చెందిన రాచకొండ శివకుమార్, గండ్రోతి చంద్రమౌళి, బండారు భాస్కరరాజేష్, భీమ్లా దుర్గాసాయి, అశెట్టి సాయిచంద్ర, పళ్ల ప్రభుదేవ్, యర్రంశెట్టి బాలాజీ, సుందరనీది సాధుబాలాజీ ఆ విధ్వంసకాండలో పాల్గొన్న ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు చిక్కాయి. రాళ్లు పట్టుకుని, రాళ్లు రువ్వుతూ.. క్రియాశీలకంగా వ్యవహరించినట్టు ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో అమలాపురంలో అల్లర్లకు టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్ర పన్నాయన్నది స్పష్టమైంది.

అమలాపురం విధ్వంసంలో మరో 18 మంది అరెస్టు
అమలాపురం టౌన్‌: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 18 మంది నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వీరితో కలిపి ఈ కేసుల్లో ఇప్పటివరకు 62 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురంలో జరిగిన వరుస అల్లర్లకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.

నిందితులను గుర్తించేందుకు ఏడు, అరెస్టు చేసేందుకు ఏడు.. మొత్తం 14 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం అరెస్టు చేసిన నిందితుల్ని ముమ్మిడివరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచామని, వారిని సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలిస్తామని తెలిపారు. అల్లర్లలో పాల్గొన్న వారిని సైంటిఫిక్‌ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్‌ మీడియా ఆధారంగా గుర్తిస్తున్నట్లు వివరించారు. కోనసీమ జిల్లాలో సెక్షన్‌ 144, 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత సోమవారమూ కొనసాగవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు