సీఎంపై అసభ్యకర పోస్టులు.. ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై కేసు

23 Oct, 2021 08:04 IST|Sakshi

రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చనిపోయారని సంతాపం వ్యక్తంచేస్తూ వాట్సాప్‌ స్టేటస్‌లలో పోస్టులు పెట్టడంపై ఇక్కడి వైస్‌ ఎంపీపీ విజయశేఖర్‌బాబు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కథనం మేరకు.. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు ఎన్‌. నాగార్జుననాయుడు వాట్సాప్‌ స్టేటస్‌లలో సీఎం జగన్‌పై గురువారం సంతాప పోస్టులు పెట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వైస్‌ ఎంపీపీ విజయశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన టీడీపీ కార్యకర్త నాగార్జుననాయుడుపై రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగార్జుననాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తల పేర్లు వెలుగులోకి వచ్చాయి. పులిచెర్లకు చెందిన హరినాథ్, సోమలకు చెందిన వెంకటసుబ్బయ్య కూడా ఉన్నట్లు తేలింది. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.

నిందితులను పీలేరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఇక సీఎం జగన్‌ చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే టీడీపీ కార్యకర్తలు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రెడ్డీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలైన నిందితులను అరెస్టు చేయాలని కోరారు.

చదవండి: అమరావతి అంటాడు.. ఇక్కడ మాత్రం మా అల్లుడికి ఇళ్లు లేదు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు