విగ్రహం మలినం కేసు: టీడీపీ నేత అరెస్టు

16 Jan, 2021 06:57 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, చినరాజప్పలతో నిందితుడు బాబూఖాన్‌చౌదరి (పాతచిత్రం)

రాజమహేంద్రవరం రూరల్‌: వినాయకుని విగ్రహానికి మలినం పూసిన కేసులో టీడీపీ నాయకుడిని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వల్లేపల్లి ప్రసాద్‌బాబు ఎలియాస్‌ బాబూఖాన్‌ చౌదరికి స్థానిక వెంకటగిరి ప్రాంతంలో ఇల్లు ఉంది. దానికి వీధి శూల ఉండడంతో ఇంటి గేటు వద్ద వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు మలినం పూశారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని బాబూఖాన్‌ చౌదరి గత ఏడాది సెప్టెంబర్‌ 12న విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారు.

దీనిపై వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పీఏ చిటికిన సందీప్, బీజేపీ నాయకులు అడపా వరప్రసాద్, కరుటూరి శ్రీనివాసరావులు ఫేస్‌బుక్, ప్రసార మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీనిపై బాబూఖాన్‌ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. వినాయక విగ్రహానికి మలినం పూసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తప్పుడు ప్రచారం చేసింది బాబూఖాన్‌చౌదరేనని నిర్ధారించారు. దీంతో గురువారం రాత్రి అతడిని అరెస్టు చేసి, శుక్రవారం ఉదయం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. అతడికి 15 రోజులు రిమాండ్‌ విధించి, కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన చిటికిన సందీప్, అడపా వరప్రసాద్, కరుటూరి శ్రీనివాసరావులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి తెలిపారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు