భూ కబ్జా కేసులో టీడీపీ నేత, డాక్యుమెంటు రైటర్‌ అరెస్టు

30 Jul, 2021 14:59 IST|Sakshi
నిందితుడు మూనే రాజశేఖర్‌ (ఫైల్‌)   

మదనపల్లె టౌన్‌: భూ కబ్జా కేసులో టీడీపీ నాయకునితో పాటు డాక్యుమెంటు రైటర్‌ను ఒకటో పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ ఈదురు బాషా, ఎస్‌ఐ లోకేష్‌ కథనం మేరకు, మదనపల్లె మండలం, బసినికొండలోని ముంబయి–చెన్నై జాతీయ రహదారి పక్కన డ్రైవర్స్‌ కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 718–3ఏలో 2.43 ఎకరాల డీకేటీ భూమిని కబ్జా చేసి, తప్పుడు రికార్డులు సృష్టించారు.

ఈ వ్యవహారంలో జూలై 1వ తేదీన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బాలాజీనగర్‌లో ఉండే టీడీపీ నాయకుడు మూనే రాజశేఖర్‌తోపాటు ఉదయ్‌కుమార్, వాసుదేవరెడ్డి, సీటీఎంలో ఉండే శివాణి, అప్పటి తహసీల్దార్లు రమాదేవి, సీఎస్‌ సురేష్‌బాబు(లేట్‌), సివి శివరామిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు సీఆర్‌ మంజుల, పాళెం శ్రీనివాసులు, సయ్యద్‌ అహ్మద్, వీఆర్వో శ్రీనివాసులు, డాక్యుమెంట్‌ రైటర్‌ నాగరాజ, సయ్యద్‌ ముస్తాఫాసిరాజ్, కిరణ్, షేక్‌ ఫరీదాబేగంను నిందితులుగా పేర్కొంటూ నాన్‌ బెయిలబుల్, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు రాజశేఖర్, నాగరాజను గురువారం రాత్రి వారి ఇంట్లోనే అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని స్థానిక ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండు విధించినట్లు చెప్పారు. ఈ భూ కబ్జా, తప్పుడు  రికార్డులు సృష్టించిన కేసులో మొత్తం 15 మందిలో ఇద్దరిని అరెస్టు చేయగా, ఒకరు (తహసీల్దార్‌ సురేష్‌బాబు) మృతి చెందారని మిగతా 12 మందిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ ఈదురుబాషా తెలిపారు.

మరిన్ని వార్తలు