కారుతో గుద్ది చంపేస్తాం

4 Feb, 2021 05:26 IST|Sakshi
బ్రహ్మసముద్రంలో మద్యం తాగుతున్న తమ్ముళ్లు

బరితెగించిన టీడీపీ 

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభపర్వం 

యథేచ్ఛగా డబ్బు, మద్యం పంపిణీ 

నామినేషన్‌ వేయించేందుకు దళితుడి కిడ్నాప్‌ 

మా ఊళ్లో నిలబెడతావా.. అంతుచూస్తాం.. అంటూ దాడి 

నామినేషన్‌ వేశాడని మోటారు సైకిల్‌ దహనం 

సంగతి చూస్తామంటూ పోలీసులకు హెచ్చరికలు 

సాక్షి నెట్‌వర్క్‌:  పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాహనాలు తగులబెడుతున్నారు. తమ మాట వినకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు. బుధవారం పలుచోట్ల అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలంలో నగదు పంపిణీ చేస్తూ పట్టుబడటమేగాక పెండ్లిమర్రి మండలంలో దళితుడిని కిడ్నాప్‌ చేశారు. ఓబులవారిపల్లె మండలం గద్దలరేపుపల్లెలో వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడిపై దాడిచేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో బహిరంగంగా మద్యం తాగుతూ హల్‌చల్‌ చేశారు. మద్యం సీసాలతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో నామినేషన్‌ వేసిన వ్యక్తి మోటారు సైకిల్‌ను తగులబెట్టారు.  

ఖాజీపేట మండలం దుంపలగట్టు సర్పంచి పదవికి రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి అరుణ పోటీ చేస్తున్నారు. బుధవారం ఎస్సీ కాలనీలో డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు వెళ్లారు. రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు ఆదినారాయణరెడ్డి, మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద కొంత డబ్బులు స్వాదీనం చేసుకున్న పోలీసులు వారిని ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు గ్రామంలో ఇరువర్గాల ఇళ్లను తనిఖీ చేయసాగారు. ఈ సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా సోదరులనే అరెస్టు చేస్తారా.. మీ సంగతి తేలుస్తా.. అంటూ ఎస్‌ఐ, సీఐలపై దౌర్జన్యానికి దిగారు.
పోలీసులతో వాగ్వాదం చేస్తున్న సుబ్బారెడ్డి కుటుంబీకులు 

ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు రెడ్యం సోదరులపై కేసు నమోదు చేశారు. పెండ్లిమర్రి మండలం మాచునూరు పంచాయతీ చౌటపల్లె దళితవాడకు చెందిన బి.గంగాధర్‌ను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. తమ తరఫున సర్పంచి పదవికి నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గంగాధర్‌తో నామినేషన్‌ వేయించాలని మంగళవారం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గంగాధర్‌ తండ్రి రామాంజనేయులు బుధవారం పెండ్లిమర్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నాయకుల చెరనుంచి బాధితుడిని విడిపించారు. చౌటపల్లె, అరవేటిపల్లె గ్రామాలకు చెందిన నలుగురు టీడీపీ నాయకులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. 

దళిత నాయకుడిపై దాడి 
వైఎస్సార్‌ జిల్లా ఓబులవారిపల్లె మండలం గద్దలరేపుపల్లెలో బుధవారం పాయలవారిపల్లె దళితవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు బయనేని రెడ్డికుమార్‌పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. గద్దలరేపుపల్లె పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఓసీ మహిళకు రిజర్వు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని చమ్మర్తి గిరిజమ్మతో నామినేషన్‌ వేయించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్ణయించారు. ఈ విషయంపై గిరిజమ్మ బంధువులతో రెడ్డికుమార్‌ చర్చిస్తుండగా టీడీపీ నాయకులు సురపురాజు శ్రీధర్, సురపురాజు కృష్ణంరాజు, సురపురాజు అభిషేక్‌ మోటార్‌ బైక్‌పై వచ్చి దాడి చేశారు. మా ఊరికి వచ్చి అభ్యర్థిని నిలబెడతావా.. నీ అంతు చూస్తాం.. చంపుతాం.. అంటూ బెదిరించారు.  నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తెలిపారు.  

పచ్చ కండువాలతో.. 
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో నామినేషన్‌ వేసే కార్యాలయానికి సమీపంలో టీడీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ హల్‌చల్‌ చేశారు. సమీపంలోని మద్యం దుకాణంలో కొనుగోలుచేసి పలువురిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. పార్టీ కండువాలు వేసుకుని ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. 

నామినేషన్‌ వేశాడని బైక్‌కు నిప్పు 
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం రెండో వార్డు మెంబరుగా నామినేషన్‌ వేసిన గుర్రం రాజేష్‌ మోటారు సైకిల్‌ను మంగళవారం రాత్రి తగులబెట్టారు. దీనిపై రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి తక్కెళ్లపాటి రామకోటేశ్వరరావు తనను నామినేషన్‌ వేయవద్దని బెదిరించాడని.. ఈ నేపథ్యంలో బైక్‌కు నిప్పుపెట్టారని పేర్కొన్నారు. 

కారుతో గుద్ది చంపేస్తాం 
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 57వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఇసరపు దేవిని కారుతో గుద్ది చంపేస్తామంటూ తెలుగుదేశం నాయకుడి కుమారుడు బుధవారం బెదిరించారు. తండ్రీకొడుకులు ఆమెను దుర్భాషలాడారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లో పర్యటిస్తున్న ఆమె ఓ వృద్ధుడు పింఛను రావడంలేదని చెప్పడంతో వివరాలు తెలుసుకుంటున్నారు.

ఇంతలో టీడీపీ నాయకుడు ఎరుబోతు రమణారావు కుమారుడు అశోక్‌ వచ్చి.. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోండి.. లేకపోతే కారుతో గుద్ది చంపేస్తా.. అంటూ దుర్భాషలాడాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా రమణారావు, అతని కొడుకు అశోక్‌ పట్టించుకోలేదు. దీంతో వీరిపై వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఓపక్క వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులకు క్షమాపణలు చెబుతూనే మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు