దాచి.. దోచుకుంటున్నారు...! 

25 Aug, 2020 07:58 IST|Sakshi
అక్రమ మద్యంతో పట్టుబడిన నిందితుల(కింద కూర్చున్న వ్యక్తులు)తో ఎక్సైజ్‌ శాఖాధికారులు

ఎన్నికల్లో తెచ్చిన మద్యం అమ్ముతున్న టీడీపీ నేత అనుచరులు

నాగులాపల్లిలో అక్రమ విక్రయాలపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి

తెలంగాణకు చెందిన మద్యం

స్వాధీనం, ఇద్దరు నిందితుల అరెస్టు  

పిఠాపురం: అధికారంలో ఉన్నంత కాలం దోచుకున్నది చాలేదన్నట్టు ఇప్పుడు ఏకంగా అక్రమంగా మద్యం అమ్ముకుని మరీ దోచుకుంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీ పక్క రాష్ట్రం నుంచి భారీగా మద్యాన్ని తరలించినట్టు ఎక్సైజ్‌ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 2019 ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసం తెచ్చిన మద్యాన్ని కొత్తపల్లి మండల తెలుగుదేశం ముఖ్య నేత దాచిపెట్టి ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో అధిక రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ఎక్సైజ్‌ అధికారులు బట్టబయలు చేశారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన టీడీపీ ముఖ్యనేత తన అనుచరుల ద్వారా పాలకేంద్రాన్ని అడ్డాగా చేసుకుని మద్యం బాటిళ్లను ఎక్కువ రేట్లకు విక్ర యిస్తూ గత కొన్ని నెలలు గా దోచుకుంటున్నట్టు విచారణలో తేలింది.

ఎక్సైజ్‌ సీఐ కె.కాత్యాయని కథనం ప్రకారం....
కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం పిఠాపురం స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో ఆధ్యర్యంలో ఎక్సైజ్‌ శాఖాధికారులు ఆదివారం అర్ధరా త్రి మాటు వేసి దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేత అనుచరులు పెనుమల్లు సుబ్బిరెడ్డి, కడిమిశెట్టి సూర్యచక్రం పట్టుబడ్డారు. వీరి నుంచి  103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్టు ఆమె తెలిపారు. ఈదాడుల్లో పిఠాపురం ఎక్సైజ్‌ శాఖాధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గ నేతలకు తెలియకుండా.. 
ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి  తెచ్చి నియోజకవర్గ ముఖ్యనేతకు తెలియకుండా మద్యంను దాచిపెట్టి, ఇప్పుడు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ పథకాలలో భారీగా అక్రమాలకు పాల్పడిన సదరు మండల టీడీపీ నేత ఇప్పుడు అక్రమ మద్యం అమ్ముతు కూడా దోచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికారులు విచారణ చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు