ఆ టీడీపీ నేత.. నిత్య పెళ్లి కొడుకు

13 Feb, 2022 04:04 IST|Sakshi
ముగ్గురు యువతులతో మంజునాథ్‌

ఒకరికి తెలియకుండా ఒకర్ని.. ఇలా మూడు పెళ్లిళ్లు 

ఆ తర్వాత వేధింపులు  

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత బాగోతం   

పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్యలు

పెద్దతిప్పసముద్రం: ఆయన తెలుగుదేశం పార్టీ నేత. పార్టీలో అత్యంత క్రియశీలకంగా వ్యవహరిస్తుంటాడు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే ఆయన నిత్య పెళ్లికొడుకన్న విషయం తాజాగా బయటపడింది. డబ్బున్న యువతులకు వల వేసి ప్రేమ పేరుతో వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ బాగోతాన్ని మూడో భార్య కనిపెట్టింది. రెండో భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటకు చెందిన దండుపల్లి వెంకటరమణ కుమారుడు మంజునాథ్‌. బెంగళూరులో కాంక్రీట్‌ మిల్లర్‌లు అద్దెకు ఇస్తుంటాడు.

కొంత డబ్బు పోగేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం మదనపల్లి సమీపంలోని అంగళ్లులో రజనీ అనే యువతిని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక వదిలేశాడు. అనంతరం బెంగళూరు వెళ్లిపోయాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మ్యారేజ్‌ బ్యూరో ద్వారా కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు చెందిన ఆశా అనే యువతిని ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఐదేళ్ల పునీతశ్రీ అనే పాప కూడా ఉంది. అనంతరం అదనపు కట్నం పేరిట వేధించి ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలతో పరారయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ధావణగెరేకు చెందిన ప్రియాంక అనే యువతిని వల్లో వేసుకున్నాడు.  వంద గ్రాముల బంగారం, రూ.5 లక్షలు కట్నంగా తీసుకుని ఇరు కుటుంబీకుల సమక్షంలో మూడేళ్ల కిందట ధర్మస్థలంలో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి పంపగా ఆడపిల్లకు జన్మనిచ్చింది.  


కట్నం కోసం వేధింపులు
ఇదే అదనుగా భావించిన ఆ నిత్య పెళ్లి కొడుకు హుటాహుటిన బెంగళూరులో ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇల్లు ఎందుకు ఖాళీ చేశావని ఫోన్‌ ద్వారా భార్య ప్రియాంక ప్రశ్నించగా.. ఇక్కడే కాపురం చేద్దాం.. వచ్చేయ్‌ అని చెప్పడంతో ఆమె ఏడాది కిందట పాపతో సహా అత్తారింటికి చేరుకుంది. అయితే ఆరు నెలలుగా భర్తతో పాటు అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే ఈ ప్రబుద్ధుడి వ్యవహారం ప్రియాంక తెలుసుకుంది. ఆమెకు రెండో భార్య ఆశా కూడా తోడైంది. దీంతో వారు పెద్దతిప్పసముద్రం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ మధురామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. అయితే వీరు స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఆధార్, రేషన్‌ కార్డు తదితర ఎలాంటి ఆధారాలూ లేనందున కర్ణాటక రాష్ట్రంలో ఫిర్యాదు చేయాలంటూ వారిని వెనక్కి పంపినట్టు ఎస్‌ఐ చెప్పారు. 

మరిన్ని వార్తలు