కొమ్మాలపాటి.. అవినీతి కోటి

7 Dec, 2020 04:00 IST|Sakshi

కరెంటు బిల్లు కట్టకుండా.. అక్రమంగా విద్యుత్‌ వినియోగం

భూగర్భ లైను వేసి మరీ వాడుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

సుమారు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి

విజిలెన్స్‌ దాడిలో అక్రమాలు బట్టబయలు

రూ.1.69 కోట్లు చెల్లించాలని తేల్చిన అధికారులు

‘పవర్‌’ను వాడేశాడు.. ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డదారుల్లో ఉపయోగించాడు.. నిబంధనల్ని పాతేశాడు.. ప్రభుత్వ ఖజానాకే షాక్‌ ఇచ్చాడు.. లక్షల రూపాయల విద్యుత్‌ బకాయిలు కట్టకపోవడమేగాక అక్రమంగా కరెంటు వాడుకున్నాడు.. ఆవైపు చూసినవారి గొంతుల్ని పవర్‌తో నొక్కేశాడు.. పలువురు అధికారుల్ని మేనేజ్‌ చేశాడు.. పెద్దమనిషిగా చలామణి అవుతూ అవినీతిని కొమ్మలుకొమ్మలుగా విస్తరించాడు.. ఇదీ.. తెలుగుదేశం నాయకుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అవినీతి కథ. సామాన్యుడు ఒక నెల విద్యుత్‌ బిల్లు కట్టకపోయినా అధికారులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. అలాంటిది కొమ్మాలపాటి శ్రీధర్‌ అక్రమంగా విద్యుత్‌ నొక్కేస్తుంటే అధికారులు తెలియనట్లే వ్యవహరించారు. కొందరు అధికారానికి భయపడి, మరికొందరు అవినీతికి పాల్పడి మౌనంగా తలవంచారు. ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి పడుతున్నా తమది కాదుగా.. అన్నట్లు వ్యవహరించారు. 

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సుమారు నాలుగేళ్లుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో శ్రీనాగమల్లేశ్వరి స్పిన్‌టెక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో స్పిన్నింగ్‌ మిల్లు, గాయత్రి శ్రీనారాయణస్వామి జిన్నింగ్‌ మిల్లు ఉన్నాయి. జిన్నింగ్‌ మిల్లుకు సంబంధించి సర్వీసు నంబరు జీఎన్‌టీ 3231కి విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్‌ 15న అధికారులు తనిఖీ చేశారు. బిల్లు చెల్లించనందుకు డీఫాల్ట్‌ చేసి నోటీసులు ఇచ్చారు. రూ.19 లక్షల విద్యుత్‌ బిల్లు, రూ.ఐదు లక్షల సర్‌చార్జీ మొత్తం రూ.24 లక్షలు పెండింగ్‌ ఉండటంతో విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత కూడా కొమ్మాలపాటి ఆ బిల్లును చెల్లించలేదు. అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎవరూ ఆయనవైపు చూడలేకపోయారు.

భూగర్భంలో అవినీతి లైను
జిన్నింగ్‌ మిల్లుకు విద్యుత్‌ సరఫరా నిలిపేయడంతో కొమ్మాలపాటి అక్రమమార్గం ఎంచుకున్నారు. అక్కడికి 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్‌ మిల్లు నుంచి భూగర్భంలో విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసి జిన్నింగ్‌మిల్లుకు కనెక్షన్‌ ఇచ్చారు. విద్యుత్‌ మాల్‌ప్రాక్టీస్‌కు తెరతీశారు. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. విద్యుత్‌ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీహెచ్‌ఏ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బిల్లు స్టాప్, బిల్లు చెల్లించని కనెక్షన్లను తనిఖీ చేయాలని నవంబర్‌ 16, 17 తేదీల్లో ఏడీఈలు, ఏఈలను ఆదేశించారు. దీంతో నవంబర్‌ 23న అధికారులు తనిఖీ చేయగా భూగర్భ విద్యుత్‌ లైను బయటపడింది. తరువాత 24, 25, 26 తేదీల్లో విజిలెన్స్‌ అధికారులు కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన జిన్నింగ్, స్పిన్నింగ్‌ మిల్లుల్లో తనిఖీలు చేశారు. భూగర్భ మార్గంలో నుంచి విద్యుత్‌ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు నాలుగేళ్లుగా ఇలా ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్న కొమ్మాలపాటి అవినీతిని బట్టబయలు చేశారు. జిన్నింగ్‌ మిల్లుకు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌చేసి నోటీసులిచ్చారు. 

రూ.1.69 కోట్లు చెల్లిస్తేనే తిరిగి కనెక్షన్‌
జిన్నింగ్‌మిల్లును పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు రూ.1.69 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. పాత బకాయిలు, ఫైను కలిపిన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 

ఉన్నతాధికారులపై అనుమానాలు
జిన్నింగ్‌ మిల్లుకు 2016 డిసెంబర్‌ నుంచి ఇప్పుడు 2020 నవంబర్‌ వరకు సుమారు నాలుగేళ్లపాటు కోటిరూపాయలకు పైగా విలువైన విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా ఉన్నతాధికారులకు తెలియలేదంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పిన్నింగ్‌ మిల్లు నుంచి జిన్నింగ్‌ మిల్లుకు భూగర్భ లైన్‌ వేశారంటే విద్యుత్‌ అధికారుల ప్రమేయం ఉండే ఉంటుందని ఆ శాఖలోని కొందరు చెబుతున్నారు. గతనెలలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసినా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్నతాధికారుల లాలూచీ ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై గుంటూరు విజిలెన్స్‌ ఈఈ విజయకృష్ణను వివరణ కోరగా ఈ విషయాలు బయటకు చెప్పేవి కాదన్నారు. జిన్నింగ్‌ మిల్లుకు సంబంధించి రూ.1.69 కోట్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు