‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. 

3 Jun, 2021 08:53 IST|Sakshi
కృష్ణారెడ్డి నిర్మించుకున్న ఇల్లు

గత ప్రభుత్వ హయాంలో 40 ఎకరాల కబ్జా

కుటుంబసభ్యుల పేరుతో డీకేటీ పట్టాలు

యథేచ్ఛగా పంటల సాగు  

గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేత ఓ గుట్టపై కన్నేశాడు.. గుట్టుగా రాళ్లురప్పలు తొలగించి చదును చేసుకున్నాడు.. పలుకుబడితో అధికారులను లొంగదీసుకున్నాడు.. నిబంధనలకు విరుద్ధంగా కుటుంబసభ్యుల పేరుతో డీకేటీ పట్టాలు పొందాడు.. 40 ఎకరాల సర్కారు భూమిని యథేచ్ఛగా కబ్జా చేసేసుకున్నాడు.. అందులో ఇల్లు నిర్మించుకుని దర్జా వెలగబెడుతున్నాడు. అడిగేవారు ఎవరంటూ పంటలను సైతం సాగు చేసుకుంటున్నాడు.  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం బూడిదవేడు రెవెన్యూ గ్రామ పరిధిలో టీడీపీ నేత కృష్ణారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఒకటి కాదు.రెండుకాదు..ఏకంగా 40 ఎకరాలను స్వాహా చేశాడు. భూమిని చదును చేసుకుని పంటలను సాగు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో జామ, దానిమ్మ, నేరేడు, బొప్పాయి తదితర మొక్కలను నాటుకున్నాడు. అనధికారికంగా బోర్లు వేసుకోవడమే కాకుండా నివాసగృహమే నిర్మించుకున్నాడు.  

టీడీపీ హయాంలో ఆక్రమణ 
వాల్మీకిపురం మండల టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఆగడాలను గతంలోనే ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించి వెలుగులోకి తీసుకువచ్చింది. బూడిదవేడు రెవెన్యూగ్రామం 521/1, 560/2 సర్వే నంబర్లలో 16.98 ఎకరాలు, 483, 497, 521/3, 561 సర్వే నంబర్లలో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిగ్గు తేల్చింది. అయితే అప్పట్లో టీడీపీ నేతల ఒత్తిడికి అధికారులు తలొగ్గారు.  నిబంధనలు గాలికివదిలేసి కృష్ణారెడ్డికి వత్తాసు పలికారు. దీంతో ఆయన తన భార్య, అమ్మ, కూతురు,  సమీప బంధువు పేరుతో డీకేటీ పట్టాలను తీసుకుని 40 ఎకరాలను ఆక్రమించుకున్నారు.  దీనికి అధికారులు సైతం పూర్తిగా సహకరించి మోతుబరి అయిన కృష్ణారెడ్డికి డీకేటీ పట్టాలతో ప్రభుత్వ భూమిని అప్పగించారు.

నల్లారి కిషోర్‌ అండతో.. 
కృష్ణారెడ్డి భూబాగోతంపై అప్పటి మదనపల్లె ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి 2018 ఏప్రిల్‌ 19న వాల్మీకిపురం తహసీల్దార్‌ను విచారణకు ఆదేశించారు. అయితే టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండదండలతో  కృష్ణారెడ్డి  పరపతిని సదరు భూములను సొంతం చేసుకున్నాడు. దీంతో అధికారులు కూడా విచారణ  ఫైల్‌ను అటకెక్కించేశారు.

కోవిడ్‌ కారణంగానే ఆలస్యం 
కృష్ణారెడ్డి భూఆక్రమణపై నివేదికను కలెక్టర్‌కు పంపించాం. నోటీసులు జారీ చేసి వాయిదాలకు హాజరుకావాల్సిందిగా ఆదేశించాం. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్డీఓ కోర్టు నిర్వహించకపోవడంతో చర్యలు తీసుకోవడం ఆలస్యమవుతోంది.
– ఎన్‌.ఫిరోజ్‌ఖాన్, తహసీల్దార్, వాల్మీకిపురం మండలం

చదవండి: నేను చనిపోతున్నా.. కలకలం రేపిన యువకుడి మెసేజ్‌ 
విషాదం: ఉద్యోగం దొరకక.. మనస్తాపానికి గురై..

 

మరిన్ని వార్తలు