గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు 

10 Mar, 2023 03:58 IST|Sakshi

తిరుపతి జిల్లా పుత్తూరులో ఆరుగురి అరెస్టు 

రూ.2.52 లక్షల విలువైన 21.05 కేజీల గంజాయి స్వాదీనం 

అరెస్టయిన వారిలో ఒకరు నారా లోకేశ్‌కు సన్నిహితుడు 

మరొకరు టీడీపీ పుత్తూరు పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు 

మరో ఇద్దరు పరారు 

పుత్తూరు రూరల్‌ (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం దొరికిపోయారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరితోపాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌చార్జి డీఎస్పీ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు పట్టణంలోని స్వర్ణా హౌసింగ్‌ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ లక్ష్మీనారాయణ అక్కడికి సిబ్బందితో వెళ్లారు.

ముళ్ల పొదల మధ్యలో 8 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోబోగా, ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో నాగలాపురం మండలం వినోబానగర్‌కు చెందిన ఎ.విజ­యభాస్కర్‌ (22), నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కె.­యూ­కేష్‌ (21), పుత్తూరుకు చెందిన కాశీం మస్తాన్‌ (29), టి.సందీప్‌కుమార్‌ (27), సి.ఎం.శరవణ (35), బి.ఎస్‌.హరికృష్ణ అలియాస్‌ హరి (30) ఉన్నారు. వీరి నుంచి రూ.2.52 లక్షలు విలువ చేసే 21.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన వెంకటేష్‌ వద్ద గంజాయిని కొని పుత్తూరులో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. పరారైన మోనిష్, బాలుతో పాటు అరకుకు చెందిన వెంకటేష్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తా­మని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్టు పెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
 
గతంలోనూ అరెస్టయిన హరికృష్ణ  
అరెస్టయిన వారిలో హరికృష్ణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో పుత్తూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. శరవణ ప్రస్తుతం  టీడీపీ  పుత్తూరు పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు.

గత ఏడాది జనవరి 10న విజయనగరం జిల్లా కాపుసోంపురం వద్ద 28 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో హరికృష్ణ రెండో నిందితుడు. అదే రోజు అరెస్టయిన వారిలో మరో టీడీపీ నాయకుడు హేమంత్‌ మూడో నిందితుడు. ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన హరికృష్ణ మరోసారి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు