వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే?   

8 Jan, 2022 15:34 IST|Sakshi
ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు - పన్ను రశీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయవద్దంటూ మందడం కార్యదర్శి సబ్‌ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖ

రూ.3.60 కోట్ల విలువైన భూమికి అక్రమ రిజిస్ట్రేషన్‌ 

అధికారులను భయపెట్టి ఇంటి, నీటిపన్ను వేయించారు

మరొకరికి అమ్మేందుకు తీవ్ర యత్నాలు

మందడం కార్యదర్శి అభ్యంతరంతో నిలిచిన రిజిస్ట్రేషన్‌

ఆక్రమణదారుల మధ్య స్థల వివాదంతో పోలీస్‌స్టేషన్‌కు

అది ప్రభుత్వ భూమి అంటున్న పంచాయతీ బోర్డు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీపీ నేతల కబ్జా బాగోతం ఇది. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.కోట్ల విలువ చేసే భూమిని తెలుగు తమ్ముళ్లు కాజేశారు. అధికారులను భయపెట్టి ఆ స్థలంలో నిర్మాణాలూ చేపట్టారు. పన్నులూ వేయించారు. పన్ను రశీదుల ఆధారంగా వేరొకరికి అమ్మేందుకు తెగబడ్డారు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చదవండి: మంత్రి పేర్ని నానితో వర్మ భేటీకి డేట్‌ ఫిక్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని 351–3 సర్వే నంబరులో 32.50 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల కిందట కొంతమంది పేదలకు 5 ఎకరాల మేర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. మరో 10 ఎకరాలలో చెరువు ఉంది. ఇంకా 17.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇందులో 60 సెంట్ల భూమిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత  మాదల శ్రీను, తూణగంటి వెంకటరమణ, సింహాద్రి సాంబశివరావు కన్ను పడింది.

30 సెంట్లు కబ్జా చేసిన మాదల శ్రీను  
గత ప్రభుత్వ హయాంలో మాదల శ్రీను తెలుగుదేశం పార్టీ  జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, మందడం గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడిగా పనిచేశారు. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని 351–3 సర్వే నంబర్‌లో ఉన్న సుమారు రూ.1.80 కోట్ల విలువైన 30 సెంట్ల భూమిని ఆక్రమించాడు. అప్పటి ప్రభుత్వంలో అధికారులను బెదిరించి ఇంటి పన్ను, నీటి పన్ను వేయించుకున్నాడు. రెండు నెలల కిందట ఈ స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మి మందడం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు యత్నించాడు.

విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయకూడదని అభ్యంతరం తెలుపుతూ మందడం సబ్‌ రిజిస్టార్‌కు లేఖ రాశారు. దీంతో శ్రీను ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని అడ్డంపెట్టుకొని మంగళగిరి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కొంత భూమిని మరో వ్యక్తికి అమ్మినట్టు రిజిస్ట్రేషన్‌ చేసి మరో కొంత భూమిని నోటరీ చేశాడు. మాదల శ్రీనుకు అప్పటి తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. 2018లో ఈ భూమిలోని నిర్మాణానికి ఇంటి పన్ను వేయడం లేదంటూ మందడం పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి కార్యదర్శిపై మాదాల శ్రీను దాడి చేశాడు కూడా. దీనిపై తుళ్లూరు పోలిస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయింది. మాదాల శ్రీను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతాడనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి.

మరో ఇద్దరి స్వాదీనంలో 30 సెంట్లు  
ఇదే సర్వేనంబర్‌లోని మరో 30 సెంట్ల భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు తూణగంటి వెంకట రమణ, సింహాద్రి సాంబశివరావు ఆక్రమించారు. చెరొక 15 సెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. దీనిలో రేకుల షెడ్డు వేశారు. వీరికి అప్పటి టీడీపీ పెద్దల అండ ఉండడంతో స్థలాన్ని వీరి పేరుపై రిజి్రస్టేషన్‌ కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం స్థలం విషయంలో వివాదం వచ్చింది. దీంతో వారం కిందట తుళ్ళూరు పోలీసులను ఆశ్రయించారు.

అది ప్రభుత్వ భూమే 
దీనిపై మందడం పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావును వివరణ అడగ్గా అది ప్రభుత్వ భూమి అని తెలిపారు. ఆక్రమిత స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరిక బోర్డు పెట్టినట్టు వెల్లడించారు. స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఉన్నతాధికారుల సూచనతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 60సెంట్ల భూమి విలువ సుమారు రూ.3.60 కోట్లు ఉంటుందని అంచనా.  

మరిన్ని వార్తలు