కనపర్రులో టీడీపీ నేతల దౌర్జన్యం

4 Sep, 2022 04:26 IST|Sakshi
మానసిక వికలాంగుడు అనిల్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైకి కారును దూకించిన మూకలు 

నలుగురికి గాయాలు 

వైఎస్సార్‌ వర్ధంతిని అడ్డుకునేందుకు కుటిలయత్నం 

నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహానేత వైఎస్సార్‌ వర్థంతిని అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైకి కారును వేగంగా దూకించారు. కనపర్రు గ్రామంలో శుక్రవారం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని భారీ అన్నదానం చేపట్టారు.

మహానేత విగ్రహానికి సాయంత్రం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు నాతాని సురేష్, నాతాని ఆంజనేయులు, నాతాని మనోహర్‌లతోపాటు రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత కుమారుడు రమేష్, కావూరు గ్రామానికి చెందిన కందుల శివప్రసాద్‌ గ్రామంలోని టీడీపీ నాయకుని నివాసంలో పూటుగా మద్యం సేవించారు.

ఆ తర్వాత తమ కారుకు టీడీపీ జెండా కట్టుకుని ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తూ నానా హంగామా సృష్టించారు. ర్యాలీగా వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అటకాయించేందుకు తమ కారును అడ్డుగా నిలిపారు. కారును తొలగించాలని గ్రామ సర్పంచ్‌ పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు కోరారు. దీంతో వారు కారును వేగంగా కార్యకర్తలపై దూకించారు.

దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కుంచాల శివశంకర్, మానసిక వికలాంగులైన చెవుల అనిల్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అన్నలదాసు ప్రసాద్, వేముల బాలరాజు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు