బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు

13 Feb, 2023 02:40 IST|Sakshi
వడ్డాది రమణ

నెల రోజులుగా ఓ మహిళకు టీడీపీ నేత తమ్ముడి వేధింపులు

తాజాగా చేతులు వేసి.. అనుచిత వ్యాఖ్యలు

ఇంట్లో వారికి విషయం చెప్పిన బాధితురాలు.. ఇది పద్దతి కాదన్న అత్త, మామ, మరిది 

మమ్మల్నే ప్రశ్నిస్తారా.. అంటూ 20 మందితో దాడి

అనుచరులతో కలిసి కత్తులతో స్వైర విహారం

నలుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఆరుగురిపై కేసు నమోదు

వించిపేట (విజయవాడ పశ్చిమ): టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోయింది. మహి­ళలన్న గౌరవం, విచక్షణ లేకుండా బరితెగించి లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ప్రజల్లో ఉనికి కోల్పోతున్నామనే అక్కసుతో ప్రశ్నించిన వారిపై మూకుమ్మడి దాడులకు దిగుతుండటం నిత్యకృత్యమైంది. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేయడమే టీడీపీ విధానంగా.. ఆ పార్టీ నేతలు బజారు రౌడీలను మించి కొట్లాటలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తమ కుటుంబంలోని మహిళను ఎందుకు వేధించారని ప్రశ్నించిన పాపానికి విజయవాడలో టీడీపీ నేత ఒకరు ఏకంగా 20 మందికి పైగా అనుచరులతో కలిసి.. కత్తులతో ఆ మహిళ కుటుంబంపై విచక్షణ రహి­తంగా దాడి చేయడం ఆ పార్టీ దిగజారు­డుతనానికి నిదర్శనంగా నిలిచింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. విజయవాడ నగరంలోని 55వ డివిజన్‌ (వించిపేట) టీడీపీ అధ్యక్షుడు వడ్డాది రమణ తమ్ముడు వడ్డాది నరేష్‌ నెల రోజులుగా స్థానికంగా నివసించే ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బయటకు వెళ్తున్న ఆమెపై చేతులు వేసి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆమె అత్త, మామ, మరిది కలిసి టీడీపీ నాయకుడు వడ్డాది నరేష్‌ ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు రమణ, నరేష్‌ ఇంటి వద్ద లేరు. జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పి.. మరోసారి ఇలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించి వచ్చేశారు. 

మా ఇంటి వద్దకే వస్తారా..
బాధితులు తమ ఇంటి వద్దకు వచ్చి వెళ్లారనే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వడ్దాది రమణ, నరేష్‌.. 20 మంది అనుచరులతో కలిసి వివాహిత ఇంటిపైకి దాడికి వెళ్లారు. ‘మా ఇంటికే వచ్చి హెచ్చరిస్తారా.. మీకెంత ధైర్యం.. ఇప్పుడు మీకు ఎవరు అడ్డువస్తారో చూస్తాం..’ అని బూతులు తిడుతూ వివాహిత మామ ఏడుకొండలు, అత్త భారతి, మరిది అరుణ్‌కుమార్‌తో పాటు స్థానిక యువకుడు హేమంత్‌పై కత్తులతో దాడి చేశారు.

అరుణ్‌కుమార్‌కు పొత్తి కడుపులో, మిగలిన వారి ఒంటిపై పలు చోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులు వడ్డాది రమణ, వడ్డాది నరేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ కత్తులు పట్టుకుని ఇలా ఇంటి పైకి రావడం దారుణం అని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు