మద్దతిస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తాం

24 Oct, 2020 03:53 IST|Sakshi
ఆందోళనకారులను తొక్కిస్తానంటూ ట్రాక్టర్‌ తీసుకువచి్చన టీడీపీ కార్యకర్త

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో టీడీపీ నేతల బెదిరింపులు

మహిళలపై కర్రలతో దాడికి ప్రయత్నం

రాయలేని భాషలో దూషణలు 

నిరసనగా రోడ్డుపై బైఠాయించిన మహిళలు

దాడికి యత్నించిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

కృష్ణాయపాలెం(మంగళగిరి)/మంగళగిరి: మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో దీక్షకు వెళ్తున్నవారిపై అమరావతి మద్దతుదారులు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంగళగిరి మండలంలోని పలు గ్రామాల నుంచి పేదలు, దళితులు ఆటోల్లో మందడం వెళ్తుండగా కృష్ణాయపాలెంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆటోలను అడ్డుకుని మహిళలను రాయలేని భాషలో దుర్భాషలాడారు. అమరావతిలో తమకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే మీకొచ్చిన నష్టమేమిటంటూ మహిళలు వారిని నిలదీశారు.

దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుతూ కర్రలతో దాడికి యత్నించారు. ఇంతలో మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు మహిళలను ట్రాక్టర్‌తో తొక్కించబోయారని, ఇది టీడీపీ అహంకారానికి నిదర్శనమని దళిత బహుజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా దళితులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఎస్పీ ఈశ్వరరావు, నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

టీడీపీ నేతలపై కేసు
కృష్ణాయపాలెంలో దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై మంగళగిరి రూరల్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి రవిబాబు తన మీద దాడికి ప్రయత్నించిన 11 మందిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుక్కమళ్ల అరుణ్‌బాబు, నంబూరి రామారావు, ఈపూరి జయకృష్ణ, ఈపూరి రవికాంత్, ఈపూరి చిన్న ఇమ్మానుయేలు, ఈపూరి మరియదాసు, చిలువూరి రాహుల్, పొంటి నరేశ్, దానబోయిన బాజి, ఈపూరి కిషోర్, కుక్కమళ్ల విజయకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్లతో తొక్కిస్తామని భయపెట్టారు
కృష్ణాయపాలెం వద్ద టీడీపీ నేతలు, వారి అనుచరులు.. మహిళలమని కూడా చూడకుండా దుర్భాషలాడారు. ‘ఇటు వస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం’ అంటూ భయపెట్టారు.   
– మేరీ, మంగళగిరి

ఆటోల్లో నుంచి బలవంతంగా లాగారు
మంగళగిరి నుంచి ఆటోల్లో వస్తున్న మమ్మల్ని ఆపి బలవంతంగా బయటకు లాగారు. అంతేకాకుండా దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో దళితులపై జులుం ప్రదర్శించడం పరిపాటిగా మారింది.    – ఉష, మంగళగిరి

దుర్భాషలాడారు
ఆటోను ఆపి ఎక్కడికెళుతున్నారే.. మా భూముల్లో మీకు ఇళ్లెలా ఇస్తాడు జగన్‌’ అని టీడీపీ నేతలు నానా దుర్భాషలాడారు. కర్రలతో దాడి చేస్తామని, ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరించారు. – సుబ్బులు, మంగళగిరి

కులం పేరుతో దూషించారు
దళితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని టీడీపీ నేతలు దాడికి యత్నించారు. కులం పేరుతో దూషించారు. మాపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు చేపట్టాలి.    – కట్టెపోగు ఉదయభాస్కర్, మంగళగిరి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా