TDP-Chikoti Praveen: టీడీపీతో చికోటి ప్రవీణ్‌కు లింకులు!

30 Jul, 2022 04:11 IST|Sakshi
బోడె ప్రసాద్‌, చికోటి ప్రవీణ్‌

పలువురు నేతలతో అతనికి సన్నిహిత సంబంధాలు 

గతంలో అతని ద్వారా కంకిపాడులో క్యాసినో ఏర్పాటుకు సన్నాహాలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె 

విషయం బయటకు పొక్కడంతో చికోటి, బోడె వెనకడుగు 

ఇద్దరూ కలిసి పలుమార్లు బ్యాంకాక్, ఇతర దేశాలు వెళ్లినట్లు అనుమానాలు

సాక్షి, అమరావతి: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్‌తో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే పలువురు టీడీపీ నేతలు ఇక్కడ క్యాసినో ఏర్పాటుకు సైతం సన్నాహాలు చేశారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ సమీపంలోని కంకిపాడు వద్ద ఈడుపుగల్లులో టీడీపీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ చికోటి ద్వారా ఇందుకు అన్ని ఏర్పాట్లుచేశారు.

ఖాళీ వ్యవసాయ భూమిలో బ్యాంకాక్‌ తరహాలో క్యాసినో సెట్టింగ్‌ వేయడానికి అవసరమైన సరంజామాను కూడా తీసుకొచ్చారు. కొంత పనికూడా పూర్తయింది. అలాగే, గోవా నుంచి కొందరు మహిళలను కూడా తీసుకొచ్చారు. పేకాట సహా పలు రకాల జూదాలు, మద్యం, డ్యాన్సులు వంటి సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయని ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలోనూ క్యాసినోకు సంబంధించిన వివరాలు, పోస్టర్లూ చక్కర్లు కొట్టాయి. నిర్వాహకులే ప్రచారం కోసం వాటిని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారికి దీని గురించి సమాచారమిచ్చారు.
 
రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వెనక్కి.. 
అయితే, ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం.. విజయవాడ, కంకిపాడు పరిసర గ్రామాల్లో విస్తృతంగా చర్చ మొదలవడంతో వెనక్కి తగ్గారు. తానే క్యాసినో ఏర్పాటుకు కారణమని తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, స్థానికంగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయనే భయంతో చివరి నిమిషంలో దాన్ని రద్దుచేసుకుని తెచ్చిన సరంజామా, అమ్మాయిలందరినీ వెనక్కి పంపేశారు. ఇదంతా చికోటి ప్రవీణ్, బోడె ప్రసాద్‌ల నేతృత్వంలోనే జరిగింది. పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా తెర వెనుక ఇందుకు సహకరించినట్లు తెలిసింది. చికోటిపై ఇప్పుడు ఈడీ విచారణ మొదలవడంతో అతనితో బోడె ప్రసాద్‌కున్న సంబంధాలు వారి వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి.  

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లోనూ పాత్ర 
విజయవాడ కేంద్రంగా గతంలో వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లోనూ టీడీపీ నేతల పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బోడె ప్రసాద్, బుద్దా వెంకన్నతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాల్‌మనీ వ్యవహారాల్లో ఆరితేరినట్లు స్పష్టమైంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వారందరినీ ఆ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆ కేసు బయటపడినప్పుడు బోడె ప్రసాద్‌ బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించారు. చికోటి ప్రవీణ్‌తో కలిసి ఆయన పలుమార్లు బ్యాంకాక్, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చికోటి హవాలా వ్యవహారాల్లోనూ టీడీపీ నేతలకు లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    

మరిన్ని వార్తలు