అది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో పనే

24 Oct, 2020 04:32 IST|Sakshi

ఎమ్మెల్యే ఆర్కే తదితరులపై దుష్ప్రచారం కేసు  

పోలీసుల విచారణలో వెల్లడి

మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటుకొందరు విలేకరులపై సోషల్‌ మీడియాలో దు్రష్పచారానికి పాల్పడింది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో చైతన్య, ఎమ్మెల్సీ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్‌ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్‌కు విద్యుత్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు.

మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్‌ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్‌కుమార్‌ కీలకపాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్‌ పేరు బయటకు రావడంతో పీఆర్వో చైతన్య దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, సాక్షి విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో లారెన్స్, కొప్పూరి వేణును అరెస్ట్‌ చేసినట్టు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు