వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి 

24 Aug, 2020 11:22 IST|Sakshi
క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఇచ్ఛాపురం రూరల్‌ (శ్రీకాకుళం జిల్లా): మండలంలోని మశాఖపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా గ్రామంలో తరచూ వర్గ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పోలీసులు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. అయినప్పటికీ అడపాదడపా ఘర్షణలు ఈ  జరుగుతునే ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు దుర్గాశి చినబాబు, దుర్గాశి పురుషోత్తం, నగిరెడ్ల చిరంజీవిలకు టీడీపీ వర్గీయులు ఆశి గోపాలు, ఆశి విజయ్, ఆశి జగ్గయ్య, దుర్గాశి ప్రతాప్, దుర్గాశి దేవరాజులకు మధ్య గత కొంత కాలంగా పొలం సమస్యపై తగాదా ఉంది. ఆదివారం ఉదయం ఒంటరిగా పొలానికి వెళ్లిన దుర్గాశి చినబాబుకు, టీడీపీ వర్గీయులకు మధ్య పొలం గట్టు విషయమై ఘర్షణ తలెత్తింది.

దీంతో టీడీపీ వర్గీయులు చినబాబుపై తలపై కత్తులతో దాడిచేయడంతో తీవ్రగాయాలతో పొలంలో పడిపోయాడు. పది నిమిషాల తరువాత అదే పొలానికి వెళ్లిన పురుషోత్తం, చిరంజీవిలపై మళ్లీ కత్తులతో దాడి చేయడంతో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పురుషోత్తంకు కాలు, తొడ భాగంలో తీవ్రగాయాలు కాగా, చిరంజీవి చూపుడు వేలు తెగిపడటంతో పాటు కాలు విరిగింది. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిగా ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించగా, దుర్గాశి చినబాబు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకెళ్లారు. పురుషోత్తం స్థానిక ఆసుపత్రిలో, చిరంజీవి సోంపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.వినోద్‌బాబు, రూరల్‌ ఎస్సై కె.లక్ష్మీలు ఆసుపత్రికి చేరుకొని విచారించారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.     

మరిన్ని వార్తలు