ప్రభుత్వ విప్‌పై దాడికి టీడీపీ కార్యకర్త యత్నం

3 Oct, 2022 04:54 IST|Sakshi

గుమ్మఘట్ట: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ కార్యకర్త బెస్త మూర్తి దాడికి యత్నించారు. కాపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లారు.

ఈ మూడేళ్లలో ఏయే పథకాల ద్వారా ఎంతెంత లబ్ధిచేకూరిందన్న వివరాలతో బ్రోచర్లను లబ్ధిదారులకు అందించారు. బెస్త మూర్తి కుటుంబానికి అమ్మఒడి పథకం ద్వారా రూ.29 వేలు, రైతుభరోసా రూ.27 వేలు, సున్నావడ్డీ పథకం ద్వారా రూ.4,619,  వైఎస్సార్‌ ఆసరా కింద రూ.20,562 లబ్ధిచేకూరిందనే విషయాన్ని వివరిస్తుండగా మూర్తి దురుసుగా మాట్లాడాడు.

అక్కడే ఉన్న ఎస్‌ఐ సునీత జోక్యం చేసుకుని వారిస్తున్నా రెచ్చిపోయాడు. ప్రభుత్వ విప్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు చేతిని నలిపి, గోరు గుచ్చడంతో రక్త గాయమైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మూర్తి ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు