మద్యం అక్రమ రవాణా చేస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్‌

17 Oct, 2022 04:16 IST|Sakshi
చంద్రబాబు, లోకేష్‌తో నిందితుడు రాము

కర్ణాటక మద్యం తరలిస్తూ దొరికిన గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు

గుంతకల్లు: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయ రాము, అదే పార్టీకి చెందిన చంద్ర పోలీసులకు దొరికారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం గుంతకల్లు టూటౌన్‌ సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లుకు చెందిన తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బోయ రాముతోపాటు అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర ఆదివారం బళ్లారి నుంచి కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుంతకల్లు పట్టణ శివారులోని కొనకొండ్ల రోడ్డులో రైల్వే బ్రిడ్జి వద్ద కారు ఆపి తనిఖీ చేశారు. కారులో 19 బాక్సుల్లో 1,824 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అక్రమంగా మద్యం తరలింపు కోసం ముఠా ఏర్పాటు  
కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన రాము 2010లో అప్పటి గుంతకల్లు రూరల్‌ సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఏడాది తర్వాత ఆ పని వదిలేసి, అక్రమ మద్యం రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. గుంతకల్లుతోపాటు గుత్తి, పామిడి పట్టణాలకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేయడానికి ఏకంగా ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. గుంతకల్లులో పేకాట కేంద్రాలను కూడా నిర్వహించేవాడు.

తన అక్రమార్జనకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరాడు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మనిషిగా, ఆ పార్టీ నాయకుడు కేసీ హరి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. గత ఏడాది జూన్‌లో విడపనకల్లు మండలం డొనేకల్లు వద్ద పట్టుబడిన రూ.5 లక్షల విలువైన కర్ణాటక మద్యం తరలింపు కేసులోనూ రాము ప్రధాన నిందితుడు. అప్పుడు రాముతోపాటు గుంతకల్లుకు చెందిన టీడీపీ నాయకులు ఆకుల మల్లేష్, మహేష్, చంద్ర, దూద్‌పీరా, నవీన్‌ దాదాపు 15 రోజులు రిమాండుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ రాములో ఏమాత్రం మార్పు రాలేదు. అక్రమార్జనే ధ్యేయంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు.   

మరిన్ని వార్తలు