విషాదం: బదిలీ ఆనందం తీరకుండానే

23 Jan, 2021 08:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : భార్య పనిచేస్తున్న మండలానికి బదిలీ అయింది. ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు తీరాయని ఆనందంగా ఉన్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. బాధ్యతలు చేపట్టి నాలుగు రోజులు గడవక ముందే కుటుంబ యజమానిని గుండెపోటు రూపంలో కబళించి విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. నాతవరం మండలం తాండవ హైస్కూల్‌లో సైన్స్‌ ఉపాధ్యాయుడిగా గడుతూరి వెంకట గోపాలకృష్ణ (48) నాలుగురోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కొయ్యూరు హైస్కూల్‌లో పనిచేసే వారు. ఈయన భార్య ప్రసన్న ప్రస్తుతం నాతవరం పీహెచ్‌సీలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఆమె కూడా గతంలో  కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో వైద్యాధికారిగా పనిచేసే వారు. రెండేళ్ల క్రితం ఆమె నాతవరం పీహెచ్‌సీకి బదిలీపై వచ్చారు.

ఈమె భర్త గోపాలకృష్ణకు కూడా ఇటీవల ఇదే మండలంలోని తాండవ హైస్కూల్‌కు బదిలీ అవడంతో నాలుగురోజులక్రితం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇలా ఆ కుటుంబంలో నెలకొన్న ఆనందం కొద్దిరోజులకే పరిమితం అయింది. గడుతూరి వెంకట గోపాలకృష్ణ(48) శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను  చికిత్స నిమిత్తం నర్సీపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతిచెందినట్టు నాతవరం ఎంఈవో తాడి అమృత్‌కుమార్‌ తెలిపారు .భార్యాభర్తలిద్దరూ ఒకే మండలంలో పనిచేసే అవకాశం వచ్చిన నేపథ్యంలో గోపాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఆయన మృతిపట్ల తాండవ హైస్కూల్‌ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాలు, కొయ్యూరు హైస్కూల్‌ హెచ్‌ఎం రామారావు, ఎంఈవో బోడంనాయుడు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు