హన్మకొండలో పండగపూట విషాదం: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం

29 Jun, 2023 10:33 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: విధి ఎంత విచిత్రమైందో.. సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తోంది.  శ్రీకాంత్‌(25) అనే యువకుడిని జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోయింది. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్‌ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్‌(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది. 

కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ అనే యువకుడు బీబీనగర్ సమీపంలో శాతావాహన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి మృతి చెందాడు. శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తొలిఏకాదశి, బక్రీద్ సెలవు దినం సందర్భంగా.. ఇంటికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ బయల్దేరాడు. అయితే..

జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు శ్రీకాంత్‌. మార్గం మధ్యలో బీబీ నగర్‌ వద్ద కర్రతో కొట్టి సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సెల్‌ఫోన్‌ను కాపాడుకునే తాపత్రంలో శ్రీకాంత్‌ పట్టుజారి రైలు నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇదీ చదవండి: తండ్రి చేతిలో హతం.. ప్రియురాలు లేని జీవితం ఎందుకనుకుని..

మరిన్ని వార్తలు