అప్పు దొరక్క ఇద్దరు.. తీరక మరో ఇద్దరు..

10 Jun, 2022 01:29 IST|Sakshi
మాడవి మారు, రాథోడ్‌ మోహన్‌, గంధం రజిని

నాలుగు జిల్లాల్లో నలుగురు రైతుల బలవన్మరణం 

పాతబాకీ తీర్చలేదని కొత్త రుణం మంజూరు చేయని బ్యాంకు అధికారులు  

నార్నూర్‌(గాదిగూడ)/టేకుమట్ల/న్యాల్‌కల్‌/కెరమెరి: వానాకాలం పంటల సాగుకి పెట్టుబడి అప్పు దొరకలేదని ఇద్దరు, అప్పులు తీర్చే మార్గం కానరాక మరో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఒకరు మహిళారైతు కావడం గమనార్హం.

ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మాడవి మారు(50)కు 8 ఎక రాల భూమి ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కూ తుళ్లు, కొడుకు ఉన్నారు. గతేడాది పెద్ద కూతురు పెళ్లి కోసం అప్పు చేశాడు. మరోవైపు నిరుడు అధికవర్షాలతో పంట దిగుబడి ఆశించిన మేర రాలేదు. ఇదివరకే బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని తిరిగి చెల్లించలేదు.

దీంతో బ్యాంకు అధికారులు కొత్త రుణం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈ వానాకాలం సాగు నిమిత్తం విత్తనాలు కొనేందుకు మళ్లీ అప్పు కోసం ప్రయత్నించగా ఎక్కడా లభించలే దు. దీంతో మనస్తాపం చెందిన మారు గురువారం తెల్లవారుజామున తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం తుమ్మగూడకు చెందిన రాథోడ్‌ మోహన్‌(45) తనకున్న నాలుగెకరాల్లో పతి సాగు కోసం గతేడాది రూ.2 లక్షల అప్పు తెచ్చాడు.

దిగుబడి రాకపోవడంతో అప్పులు చెల్లించలేదు. ఈసారి పెట్టుబడి నిమిత్తం ఎక్కడ తిరిగినా అప్పు పుట్టలేదు. ఇదే విషయం భార్య శారదాబాయితో చెబుతూ మథనపడ్డాడు. బుధవారంరాత్రి ఇంట్లో అందరూ నిద్రించాక 11 గంటల ప్రాంతంలో పురుగులమందు తాగాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  

రూ. 10 లక్షల వరకు అప్పులయ్యాయని..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన గంధం రజిని(35), రాంనారాయణ దంపతులు. పెళ్లయి 16 ఏళ్లు దాటినా వారికి సంతానం కలగలేదు. భర్త కారోబార్‌గా పనిచేస్తున్నాడు. రజిని తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తోంది. ఈసారి పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికితోడు అప్పులు సుమారు రూ.10 లక్షల మేర పెరిగిపోయాయి.

అప్పులు పెరిగిపోవడం, పిల్లలు కలగకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 24న ఇంట్లో పురుగుల మందు తాగింది. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం గంగ్వార్‌ గ్రామానికి చెందిన ధనవంత్‌రెడ్డి(60)కి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్ల వివాహాల కోసం అప్పు చేశాడు.

తనకున్న ఎకరంన్నర పొలంలో పంటలు అంతంత మాత్రంగానే పండటంతో కుటుంబపోషణ కూడా భారంగా మారింది. అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం మెటల్‌కుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  

మరిన్ని వార్తలు