పిల్లల చేతిలో పేలిన ఎయిర్‌గన్‌

17 Mar, 2022 02:38 IST|Sakshi
ఎయిర్‌గన్‌. సాన్వీ మృతదేహం 

ఆడుకుంటుండగా మిస్‌ఫైర్‌ కావడంతో నాలుగేళ్ల బాలిక మృతి 

తూటాలున్న విషయం తెలియదంటున్న తండ్రి

జిన్నారం(పటాన్‌చెరు): ఎయిర్‌గన్‌ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు, సుకన్యలు వావిలాలలోని ఓ ఫాంహౌస్‌లో వ్యవసాయ పనులు చేసేందుకు మూడునెలల క్రితం వలస వచ్చారు.

వీరికి నాలుగేళ్ల కుమార్తె సాన్వి, రెండేళ్ల కుమారుడు ప్రేమ్‌కుమార్‌లు ఉన్నారు. ఫాంహౌస్‌లో వివిధ రకాల పంటలను సాగు చేస్తుండటంతో కోతులు, పక్షులను చెదరగొట్టేందుకు ఎయిర్‌గన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటివరకు నాగరాజు దానిని ఉపయోగించలేదు. అందులో గుండ్లు ఉన్న విషయం కూడా అతనికి తెలియదు. సాన్వి, ప్రేమ్‌కుమార్‌లు గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఎదురుగా ఉన్న సాన్వి కణతలోకి గుండు గుచ్చుకుపోయి రక్తస్రావంతో కింద పడిపోయింది. హుటాహుటిన సాన్విని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాన్వి బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌ గ్రామంలోనూ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఎయిర్‌గన్‌ పేలి ఐదు నెలల క్రితం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు