దూసుకొచ్చిన మృత్యువు

2 Jan, 2022 05:21 IST|Sakshi

ఇళ్ల మీదకు దూసుకెళ్లిన బూడిద ట్యాంకర్‌ 

ఇద్దరు మహిళల మృతి 

పాల్వంచ: యాష్‌ ట్యాంకర్‌ రూపంలో మృత్యువు ఇద్దరు మహిళలను బలి తీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌కు రాజమండ్రి నుంచి బూడిద కోసం వస్తున్న ట్యాంకర్‌ అల్లూరి సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ (కేటీపీఎస్‌) మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ శంకర్‌ లాల్‌ మద్యం మత్తులో అతి వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగింది.

తొలుత ఇంటి ముందు కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో శీలం కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గార్లపాటి వెంకటనర్సమ్మ (45)ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. మహిళలపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇంటిని, ఆటోను, స్కూటీని, చెట్టును, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంటి గోడలు కూలిపోయి ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి.

వేప చెట్టు కొమ్మలు విరిగిపోయి విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. ఒక్కసారిగా ట్యాంకర్‌ దూసుకురావ డంతో స్థానికులంతా హాహాకారాలు చేశారు. మృతురాలు కోటేశ్వరమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వెంకట నర్సమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.   

కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ 
విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగడంతో ట్యాంకర్‌ కేబిన్‌ భాగం దెబ్బతింది. కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ శంకర్‌ లాల్‌ను స్థానికులు, పోలీసులు బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు