online game addiction: తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతూ..

15 Jul, 2021 14:40 IST|Sakshi
కాకి మధురెడ్డి (ఫైల్‌)

సాక్షి, ఆత్మకూర్‌(సూర్యాపేట): ఆన్‌లైన్‌ గేమ్‌ సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఏపూరు గ్రామానికి చెందిన కాకి వెంకటరెడ్డి, కవితలకు  కుమార్తె, కుమారుడు సంతానం.  ఏడాది క్రితమే కుమార్తె వివాహం చేయగా కుమారుడు మధురెడ్డి (20) బీటెక్‌ మూడో సంవత్స రం  చదువుతున్నాడు.

కరోనా నేపథ్యంలో కొంతకాలంగా ఇంటివద్దనే ఉంటున్న మధురెడ్డి ఆన్‌లైన్‌ గేమ్‌ మోజులో పడ్డాడు. ఇటీవల తల్లి కవిత ఖాతానుంచి రూ.1.20లక్షలు కట్‌ కావడంతో ఆందోళన చెందింది. దీంతో ఆమె సాయంత్రం వివరాలు తెలుసుకోవడానికి స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. విషయం బయటపడుతుందని భయాందోళనకు గురైన మధురెడ్డి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.


 

మరిన్ని వార్తలు