లంచం ఇవ్వకుంటే బెయిల్‌ రద్దు

27 Oct, 2021 02:42 IST|Sakshi

నిందితుడిని బెదిరించిన కస్టమ్స్‌ అధికారులు 

సీబీఐకి నిందితుడి ఫిర్యాదు

డబ్బు తీసుకుంటుండగారెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సీబీఐ

సాక్షి, హైదరాబాద్‌: బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఓ నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి కస్టమ్స్‌ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం దిగజారి ఊచలు లెక్కబెట్టాల్సిన స్థితి తెచ్చుకున్నారు. యాకత్‌పురాకు చెందిన మీర్‌ అస్గర్‌ అలీ గత ఏప్రిల్‌ 29న దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులకు బంగారం స్మగ్లింగ్‌లో దొరికిపోయాడు. అరెస్టయి జైలుకు పోయిన అస్గర్‌కు.. తండ్రి చనిపోవడంతో మే 30న కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

దేశం విడిచి వెళ్లరాదని, ప్రతీ పదిహేను రోజులకోసారి దర్యాప్తు అధికారి వద్ద సంతకం చేయాలని షరతు విధించింది. ఇలా కొద్దిరోజుల నుంచి కస్టమ్స్‌ కార్యాలయానికి వస్తూ సంతకం చేసి వెళ్తున్నాడు. రెండు నెలల క్రితం కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న హవాల్దార్‌ సుందర్‌... అస్గర్‌ను ఇక రావద్దని, తాము పిలిచినప్పుడు వస్తే సరిపోతుందని చెప్పాడు.

దీంతో అస్గర్‌ అప్పటి నుంచి కస్టమ్స్‌ కార్యాలయానికి రాలేదు. ఈనెల 7న కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌ కృషన్‌పాల్‌నుంచి అస్గర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము ఇంటికి వస్తే ఎవరూ లేరని, ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించారు. అయితే తాను కొద్దిరోజుల క్రితమే ఇల్లు మారానని, కొత్త ఇంటి అడ్రస్‌ పంపిస్తానని చెప్పాడు.  

బెయిల్‌ రద్దు చేయిస్తాం 
తర్వాతి రోజు అస్గర్‌ ఇల్లు ధ్రువీకరించుకున్న ఈ ముగ్గురు.. రూ.20వేలు డిమాండ్‌ చేశారు. చెప్పకుండా అడ్రస్‌ మారావని, ఇది కుట్రపూరితమని బెదిరించారు. అంతేకాకుండా కొత్త ఇంటిని పంచనామా చేయాలని, తెలిసిన ఇద్దరిని తీసుకురావాలని అస్గర్‌కు చెప్పారు. అయితే ఈ సమయంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరూ ఇక్కడ లేరని చెప్పాడు. పంచానామా చేయకపోతే బెయిల్‌ రద్దు అవుతుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు.

మరుసటి రోజు ఇద్దరు స్థానికులను తీసుకొని బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్‌ జీఎస్‌టీ భవన్‌ రావాలని చెప్పారు. తర్వాతి రోజు అస్గర్‌.. సుందర్‌కు ఫోన్‌ చేసి ఇద్దరు స్థానికులు దొరకలేదని, రూ.20 వేలు కూడా ఇవ్వలేనని చెప్పాడు. 11వ తేదీన కస్టమ్స్‌ ఆఫీస్‌కు వస్తే బేరసారాలు చేసుకుందామని సుందర్‌ చెప్పాడు. దీంతో అస్గర్‌ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. 

ఆడియో నిర్ధారణ.. 
ఈ నెల 11న అస్గర్‌ కస్టమ్స్‌ కార్యాలయానికి ఇద్దరిని తీసుకెళ్లాడు. రూ.20 వేలు ఇస్తే గానీ పంచానామా చేయమని, బెయిల్‌ రద్దుకు ప్రతిపాదన చేస్తామని బెదిరించారు. అయితే చివరకు రూ.10వేలకు డీల్‌ చేసుకున్నారు. సోమవారం డబ్బులు ఇస్తానని చెప్పిన అస్గర్‌ రికార్డు చేసిన ఫుటేజ్‌ను సీబీఐకి సమర్పించాడు.

సోమవారం అస్గర్‌ కస్టమ్స్‌ సిబ్బందికి రూ.10వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆఫీసుతోపాటు వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించి పలు ధ్రువపత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. సురేష్‌కుమార్, కృషన్‌పాల్, సుందర్‌లను చేసి అరెస్ట్‌ చేసి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.   

మరిన్ని వార్తలు