కాంగ్రెస్‌ నేతల అరెస్టుల పర్వం 

19 Jun, 2022 01:52 IST|Sakshi
బల్మూరి వెంకట్‌ను అరెస్ట్‌ చేస్తున్న  జూబ్లీహిల్స్‌ పోలీసులు   

సికింద్రాబాద్‌ ఘటన నేపథ్యంలో నిరసనలు 

రాకేశ్‌ అంత్యక్రియలకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు 

గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా నగరంలో పలువురు నేతల అరెస్టులు 

బల్మూరి వెంకట్‌ను విడుదల చేయాలంటూ గోల్కొండ పీఎస్‌లో జగ్గారెడ్డి బైఠాయింపు 

గాంధీ ఆసుపత్రికి వెళుతున్న అంజన్, అనిల్, శివసేనారెడ్డిల అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం, పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో శనివారమంతా కాంగ్రెస్‌ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. శనివారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని పోలీసులు తొలుత అదుపులోనికి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేశ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వరంగల్‌ బయలుదేరిన ఆయన్ను ఘట్‌కేసర్‌లో పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో తనను అరెస్టు చేయడమేంటని, వరంగల్‌ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పలువురు నేతలు ఘట్‌కేసర్‌కు చేరుకుని రేవంత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నగరంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని గోల్కొండ పీఎస్‌కు తరలించారు.

దీంతో వెంకట్‌ను విడుదల చేయాలంటూ పీఎస్‌కు వెళ్లిన జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వరంగల్‌లో రాకేశ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాక వదిలివేస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు అనిల్‌కుమార్‌ యాదవ్, శివసేనారెడ్డిలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఘట్‌కేసర్‌ పీఎస్‌ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గోల్కొండ పీఎస్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందునే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై పోలీసులు ఫోకస్‌ చేశారని మండిపడ్డారు.అరెస్టులు కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదని, కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కేడర్‌ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.  

చావులపై టీఆర్‌ఎస్‌ రాజకీయం: రేవంత్‌ 
ఘట్‌కేసర్‌: చావులను కూడా టీఆర్‌ఎస్‌ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని రేవంత్‌ మండిపడ్డారు. రాకేశ్‌ను టీఆర్‌ఎస్‌ చంపిందని, బీజేపీ చంపించిందని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన నిరసనలో మృతి చెందిన రాకేశ్‌ కుంటుంబ సభ్యులను పరామర్శించడానికి వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం డబ్బీర్‌పేటకు బయలుదేరిన రేవంత్‌రెడ్డిని ఘట్‌కేసర ఓఆర్‌ఆర్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సాయంత్రం విడుదలైన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగే హక్కులేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఆర్మీ జవాన్ల నియామకాలు నిబంధనల మేరకు జరిగాయని, మోదీకి పోయేకాలం రావడంతో కేవలం నాలుగు ఏళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. నాలుగేళ్ల అనంతరం ఆర్మీ శిక్షణ పొందిన యువతకు ఎక్కడా ఉద్యోగం లభించకపోతే నక్సలైట్లలో కలవాలా అన్ని ప్రశ్నించారు.

రాకేశ్‌ శవయాత్రను టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలతో ర్యాలీగా నిర్వహించవచ్చు కాని టీపీసీసీ అధ్యక్షుడిగా తాను వెళతానంటే అడ్డంకులు çసృష్టిస్తారా అని ప్రశ్నించారు. కాగా, రేవంత్‌రెడ్డిని కలవడానికి ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వరంగల్‌ వె‹స్ట్‌ నియోజవర్గ ఇన్‌చార్జి కొండా సురేఖను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ఉన్న గదిలోకి వెళ్లకుండా డోర్‌ మూసివేశారు. డోర్‌ తీయని పక్షంలో తన దగ్గర ఉన్న సర్జికల్‌ బ్లేడుతో చేయి కోసుకుంటానని ఆమె బెదిరించింది. మహిళాపోలీసులు అక్కడి నుంచి ఆమెను దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు.  

మరిన్ని వార్తలు