స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్‌ నాకే కావాలంటూ మరొకరు

4 Jun, 2021 08:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌( వికారాబాద్‌ల): తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బార్గమ్‌ గ్రామానికి చెందిన గులాం, షాహిన్‌ దంపతులకు ఓ కుమారుడు, కూతురు షేక్‌ ముస్కాన్‌(17) ఉన్నారు. ఉపాధి కోసం మూడేళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు. గులాం, షాహిన్‌లు ఓ ఫౌల్ట్రీఫారంలో పనిచేస్తున్నారు. తనకు స్మార్ట్‌ఫోన్‌ కావాలని బాలిక తల్లిదండ్రులను కోరగా, కొనిస్తామని చెప్పి ఊరుకున్నారు. వారినుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన ముస్కాన్, బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

సెల్‌ఫోన్‌ కోసం తోబుట్టువుల గొడవ 
సెల్‌ఫోన్‌ కోసం తోబుట్టువుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుధాకుర్థులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధాకుర్థుకు చెందిన టేకుమట్ల వరలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు కూతురు స్నేహిత, కుమారుడు శివ ఉన్నారు. స్నేహిత పాలిటెక్నిక్‌ డిప్లొమా, శివ ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. గురువారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో స్నేహిత, శివ మధ్య సెల్‌ఫోన్‌ కోసం గొడవ జరిగింది. దీంతో స్నేహిత (20) తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.  

చదవండి: ఇన్‌స్పెక్టర్‌కు రౌడీషీటర్‌ దమ్కీ.

మరిన్ని వార్తలు