రూ.6వేలు అప్పు ఇచ్చి.. రూ.54వేలు కట్టించుకున్నారు.. అయినా వేధించడంతో..! 

20 Feb, 2023 09:39 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఆన్‌లైన్‌ యాప్‌ లోన్‌ ఆగడాలకు ఖమ్మంలో ఓ యువకుడు బలయ్యాడు. యాప్‌ వారి వేధింపులకు భరించలేక పురుగుమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్‌సింగ్‌ కుమారుడు ఆకాశ్‌(24) నగరంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించినా....ఇంకా అప్పు ఉన్నావని, అప్పు చెల్లించకుంటే ‘నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతాం’అంటూ వేధింపులకు పాల్పడ్డారు.

వారి వేధింపులు భరించలేక ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆకాశ్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీఐ సర్వయ్య మాత్రం లోన్‌యాప్‌ వేధింపులనే ఫిర్యాదు తమకు అందలేదని, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం ఉందని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్‌

మరిన్ని వార్తలు