ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే..

27 Sep, 2021 09:59 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: ఒక్కగానొక్క కూతురు.. పైగా తల్లిదండ్రులిద్దరూ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యులే. కూతుర్ని సైతం డాక్టర్‌ను చేసి వారి ఆస్పత్రిలోనే కూర్చోబెట్టాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. పుట్టిన రోజునే బిడ్డ తనువుచాలించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కూతుళ్ల దినోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.

మృతురాలు జిల్లా కేంద్రంలోని జయ మెటర్నిటీ నర్సింగ్‌ హోం వైద్యులు డాక్టర్‌ ఫణికుమార్‌–జయలలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు నేహ(24). బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నేహ గతేడాది ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్‌ అవుతోంది. ఈ క్రమంలో బంధువులతో కలిసి రెండు రోజుల క్రితం గోవా వెళ్లింది. శనివారం అర్ధరాత్రి కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకుంది. తల్లిదండ్రులతోనూ ఫోన్లో ఆనందాన్ని పంచుకుంది.

ఈ క్రమంలో తెల్లవారేసరికే గుండెపోటుతో మృతి చెందిన వార్త కన్నవారిలో తీరని శోకం మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను విడిచి ఇప్పటి వరకు నేహ పుట్టినరోజు జరుపుకోలేదు. ఎప్పడూ అడగని బిడ్డ డాడీ.. ఈ సారి గోవాలో బర్త్‌డే జరుపుకుంటానని అడిగితే తండ్రి కాదనలేక పంపించినట్లు బంధువులు తెలిపారు. కూతురు మరణవార్త విన్న తండ్రి డాక్టర్‌ ఫణికుమార్, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ బయలు దేరారు. గోవా నుంచి మృతదేహం హైదరాబాద్‌ రానున్నట్లు తెలిసింది.

జిల్లా కేంద్రంలో విషాదఛాయలు
డాక్టర్‌ ఫణికుమార్‌–జయలలిత జిల్లాలో పేరున్న వైద్యులు. ఈమేరకు వారి కూతురు మరణవార్త తెలియడంతో బంధువులు, మిత్రులు వారింటికి చేరుకున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: నన్ను బాగా చూసుకుంటానని నమ్మించి ఇల్లు అమ్మించాడు.. కానీ

మరిన్ని వార్తలు