ప్రగతిభవన్‌ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం

12 Aug, 2022 02:30 IST|Sakshi
నాగరాజు 

పంజగుట్ట: తెలంగాణ ఉద్యమకారుడు గురువారం ప్రగతిభవన్‌ ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది అడ్డుకుని అతన్ని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రాయనిగూడెం గ్రామానికి చెందిన పిడమరితి నాగరాజు (27) తెలంగాణ ఉద్యమకారుడు.

ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో భాగంగా రైలు కింద పడి రెండు కాళ్లు, ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు. ఇంత త్యాగం చేసినప్పటికీ తెలంగాణ వచ్చాక ఒక్క నాయకుడు కూడా పరామర్శించలేదని, ఏ ఆసరా చూపించలేదని ఆయన మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్‌ వద్దకు వచ్చాడు.

ముఖ్యమంత్రిని కలవాలని కోరగా.. అప్పటికే మంత్రివర్గ సమావేశం జరుగుతుండడంతో అపాయింట్‌మెంట్‌ లేనందున ప్రవేశం లేదని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో నాగరాజు వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ పైన పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది అతన్ని స్టేషన్‌కు తరలించారు. తనకు ప్రభుత్వోద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించాలని నాగరాజు డిమాండ్‌ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు