సీఎం కేసీఆర్‌ పేరుతో భారీ మోసం

21 Jun, 2021 23:33 IST|Sakshi
నిందితుడు కమల్‌ కృష్ణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కార్యదర్శిగా చలామణీ అవుతూ అమాయకులను మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని చెప్పి పలు రాజకీయ పార్టీల నాయకులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్న అతడిని రిమాండ్‌కు తరలించారు. అతడి మాటలు నమ్మి చాలా మంది పెద్ద ఎత్తున నగదు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్‌కు చెందిన కమల్ కృష్ణా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడు సీఎం కేసీఆర్‌ పేరు చెప్పుకుని డబ్బులు వసూల్‌ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా తాను పని చేస్తున్నట్లు.. బీసీ కార్పొరేషన్‌లో మీకు పదవి ఇప్పిస్తా అని ఆశచూపి నాయకుల నుంచి డబ్బులు రాబట్టారు. వివిధ పార్టీలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. సీఎం పేషీలో కార్యదర్శినని నమ్మించి డబ్బులు తీసుకుంటాడు. అనంతరం మొబైల్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. ఈ విధంగా అతడి బారిన చాలామంది నాయకులు మోసపోయారని సమాచారం. చివరకు సోమవారం నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు