గంజాయి సమస్య కొత్తది కాదు 

29 Oct, 2021 02:34 IST|Sakshi

15 ఏళ్లుగా ఏవోబీలో గంజాయి సాగవుతోంది

అక్కడి నుంచి రవాణాపై పక్కా సమాచారంతోనే దాడులు

నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో (ఏవోబీ) గంజాయి సమస్య కొత్తది కాదని, పదిహేనేళ్లుగా కొనసాగుతోందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ గంజాయి సాగుచేస్తున్న విషయం అక్కడి సీనియర్‌ పోలీసు అధికారులకు, ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఏవోబీ నుంచి గంజాయి రవాణా తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు.

దీనిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, గంజాయి రవాణా, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టాలని ఆదేశించారని వెల్లడించారు. గడిచిన నెలన్నరలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు. ఏవోబీ నుంచి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని తాము పట్టుకున్న వారి కాల్‌ డాటా ఆధారంగా గుర్తించామన్నారు.

తనిఖీల్లో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి తనిఖీలోనూ గంజాయి మూలాలు ఏవోబీవైపే చూపించాయని, గంజాయి విక్రయదారుల పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగానే దసరా రోజు నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్‌ బృందాలతో ఏపీలో దాడులు నిర్వహించామన్నారు. దీనికి ఏపీ పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు.

మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు 
ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డికి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారంతోనో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఎస్పీ రంగనాథ్‌ ఆ ప్రకటనలో వివరించారు.

ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి విషయమై చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరికాదన్నారు. ‘మా భుజాల మీద నుంచి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. గంజాయి ఇష్యూను అక్కడి నాయకులు ఎవరికి అనుగుణంగా వారు అన్వయించుకుంటూ రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవడం సరికాదన్నారు.   

మరిన్ని వార్తలు