ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

16 Mar, 2022 17:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ జగదీశ్వరరెడ్డి

సాక్షి,కొత్తూరు(వికారాబాద్‌): నమ్మకస్తులుగా మెలిగారు.. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు. అదనుచూసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసు వివరాలను మంగళవారం కొత్తూరు ఠాణాలో శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి విలేకర్లకు వెల్లడించారు. కొత్తూరు మండలంలోని ఎస్‌బీపల్లికి చెందిన యోషమోని భారతమ్మ ఈనెల 10న మహిళా సంఘంలో డబ్బులు చెల్లించడానికి నందిగామ మండలం మేకగూడకు బయలుదేరింది. మార్గంమధ్యలో కొత్తూరులోని కల్లు కాంపౌండ్‌లో సాయంత్రం కల్లు తాగడానికి వెళ్లింది.

అక్కడ ఆమెను ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్టకు చెందిన జక్కుల శివలింగం(29), కొందుర్గు మండలం విశ్వనాథపురానికి చెందిన చెక్కలి మల్లేష్‌(26) పరిచయం చేసుకున్నారు. నమ్మకస్తులుగా నటిస్తూ ఎస్‌బీపల్లిలో దించుతామని తమ బైకుపై ఎక్కించుకున్నారు. పెంజర్ల నుంచి మేకగూడ వైపునకు వెళ్తుండగా ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించగా తమ వద్ద మద్యం ఉందని తాగి వెళ్దామని తెలిపారు. అప్పటికే పథకం ప్రకారం పెంజర్ల శివారులోని డంపింగ్‌ యార్డు పరిసరాల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాయి, చేతులతో దాడి చేశారు. అనంతరం భారతమ్మ వద్ద ఉన్న రూ.6 వేలు, 10 తులాల వెండి పట్టీలు, 5 మాసాల బంగారు చెవికమ్మలు, పాత నోకియా సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈనెల 14న నందిగామ పోలీస్‌స్టేషన్‌ వద్ద నిందితుల వాహనాన్ని గుర్తించారు. కాంపౌండ్‌లో కల్లు తాగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ వివరాలు తెలిపారు.  

3 బైకులు స్వాధీనం 
శివలింగంపై షాద్‌నగర్‌తో పాటు పలు ఠాణాలో 12 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడి నుంచి 5 కేసుల్లో 3 బైకులు, రూ.4 వేల నగదు, 3.9 గ్రాముల బంగారు కమ్మలు, 9.3 తులాల వెండి పట్టీలు, 60 బంగారు గుండ్ల తాడుతో పాటు బాధితురాలి నోకియా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌గా పనిచేసే శివలింగం జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతుండడంతో అతడిపై పీడీ యాక్టు నమోదుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కేసు చేధించిన పోలీసులకు ఆయన రివార్డులు అందజేశారు.  

అపరిచితులతో సహవాసం వద్దు   
కల్లు దుకాణాలు, బస్టాండు తదితర ప్రాంతాల్లో మహిళలు, ప్రజలకు కొత్తగా తారసపడే అపరిచితులను నమ్మి సహవాసం చేయొద్దని డీసీసీ సూచించారు. వారిని నమ్మితే అన్ని విధాలుగా నష్టపోతారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సమావేశంలో షాద్‌నగర్‌ ఏసీపీ కుశాల్కర్, సీఐ బాలరాజు, ఎస్‌ఐ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు