విహారయాత్రలో విషాదం

26 Aug, 2021 09:35 IST|Sakshi

సాక్షి, కోహీర్‌(జహీరాబాద్‌): విహారయాత్రలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన మండలంలోని చింతల్‌ఘాట్‌ చౌరస్తా వద్ద 65 నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై చల్లా రాజశేఖర్‌ అందించిన సమాచారం ప్రకారం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనూష(26) అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె స్నేహితులు శైలు, దివిజ, శివ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం, చిన్న గడవెల్లి గ్రామ నివాసి పినిశెట్టి సత్యనారాయణ కూతురు అనూష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఆమె తన మిత్రులు శైలు, దివిజ, శివతో కలిసి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో దుర్ఘటన జరిగింది. మరో గంటలో గమ్యాన్ని చేరుతారనగా చింతల్‌ఘాట్‌ గ్రామ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న అనూష తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది.

కారు వెనకసీట్లో కూర్చున్న శైలు, దివిజ కారు నడుపుతున్న శివ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడం, లారీని రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్కింగ్‌ చేయడంతో ప్రమాదం జరిగిందని మృతురాలి తండ్రి సత్యానారాయణ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

చదవండి:Viral Video: ఫ్యాన్‌ మీద పడింది.. బుడ్డోడు బచాయించాడు

మరిన్ని వార్తలు