హోలీ రంగులు ఆరకముందే.. ఆ కుటుంబం ఆశలు ఆవిరయ్యాయి

19 Mar, 2022 08:03 IST|Sakshi

సాక్షి,శ్రీరాంపూర్‌(అదిలాబాద్‌): ఆ ఇంటి ఆశా దీపాలు ఆరాయి. ఎదిగిన కొడుకులు కుటుంబానికి ఆసరాగా ఉంటారని.. పెళ్లి చేస్తే తమ ఇంట్లో మరో పండంటి సంసారం వస్తుందని ఆశపడితే.. రోడ్డు ప్రమాదం అడియాశలు చేసింది. మద్యం మత్తు.. మితిమీరిన వేగం.. వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉదయం ఆడిన హోలీ రంగులు ఒంటిపై ఆరకముందే సాయంత్రానికి మృత్యు కౌగిలి పాడేపై కుంకుమ రంగు చిందించింది. శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదం ఇద్దరు యువకులను పొట్టన పెట్టుకుంది.

వివరాలు ఇలా..
శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జీఎం కార్యాలయం జాతీయ రహదారి చౌరస్తా సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. జైపూర్‌ మండలం రామారావుపేటకు చెందిన బొద్దున నరేశ్‌ (32) తన బైక్‌పై ఇందారం చెందిన తన స్నేహితుడు తోగేటి ప్రసాద్‌(31)తో కలిసి శ్రీరాంపూర్‌ నుంచి తమ స్వగ్రామాలకు వస్తున్నా రు. ఇదే సమయంలో మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి మంచిర్యాలకు వస్తుంది. చౌరస్తాకు వస్తుందనగా ముందు ఉన్న కారును ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టారు.

దీంతో వెనుకాల కూర్చున్న  ప్రసాద్‌ ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. నరేశ్‌ బైక్‌తో సహా బస్సు కింద ఇంజన్‌భాగంలో చిక్కుకుపోయాడు. ఆ వేగంతో బస్సుతో సహా సుమారు 80 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. నరేశ్, ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. శ్రీరాంపూర్‌ సీఐ రాజు, ఎస్సై మానస సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు కింద చిక్కుకున్న బైక్‌ను, అందులో కూరుకుపోయిన నరేశ్‌ మృతదేహాన్ని బయటికి తీయించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల ఆర్టీసీ డీపో మేనేజర్‌ మల్లేశయ్య, అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీలత సంఘటన స్థలాన్ని సందర్శించారు. బస్సు డ్రైవర్‌ రమేశ్‌ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బైక్‌లో మద్యం బాటిల్‌ 
బైక్‌ను బయటికి తీసిన తర్వాత అందులో మద్యం బాటిల్‌ లభించగా ఎస్సై స్వాధీనం చేసుకున్నారు.  మద్యం మత్తు.. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే యువకులిద్దరు ఉదయం తమ గ్రామాల్లో హోలీ ఆడారని, సాయంత్రం ఇందారం వద్ద మద్యం తాగారని పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్‌లో బిర్యానీ తినేందుకు వచ్చారని కొందరు, స్నేహితులను కలిసి మద్యం విందు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నారని మరికొందరు చెబుతున్నారు. బైక్‌లో దొరికిన మద్యం బాటిల్‌ ఈ ప్రమాదంలో పగులకుండా ఉండటం గమనార్హం.

పెళ్లి సంబంధాలు చూస్తుండగానే.. 
జైపూర్‌/శ్రీరాంపూర్‌: జైపూర్‌ మండలం రామారావుపేట, ఇందారంలో పండుగ పూట విషాదం నెలకొంది. నరేశ్, ప్రసాద్‌లకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నరేశ్‌ శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టు వాహనాలపై కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నరేశ్‌ తల్లిండ్రులు జగ్గయ్య–శాంతమ్మ. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. నరేశ్‌ మూడో వాడు.

ఉగాది తర్వాత పెళ్లి చేయాలని చూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతితో తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. మరో మృతుడు తొగేటి ప్రసాద్‌. మంచిర్యాలలోని బంగారుషాపులో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి–అనంతరాములు. తండ్రి చిన్నతనంలో మృతిచెందాడు. సోదరి ఉంటే ఇతనే వివాహం జరిపించాడు. వీరిది చాలా పేద కుటుంబం. తల్లి కుమారుడు ప్రసాద్‌కు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. 

మరిన్ని వార్తలు