ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి మృతి

3 Jan, 2021 02:40 IST|Sakshi
రక్షిత (ఫైల్‌)

సిడ్నీలో ఎంఎస్‌ చదువుతున్న హైదరాబాద్‌వాసి రక్షిత

జనవరి ఒకటిన స్కూటీపై వెళుతుండగా ప్రమాదం

బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు తేల్చిన వైద్యులు

ఘటనకు ముందురోజే తల్లిదండ్రులతో ఫోన్‌లో మాటలు

కుమార్తె అవయవాలు దానం చేయాలని తల్లిదండ్రుల నిర్ణయం

సాక్షి, నాగర్‌కర్నూల్‌ (వంగూరు):  ‘‘అమ్మా... నాన్న... న్యూ ఇయర్‌ ఎలా జరుపుకుంటున్నారు? తమ్ముడితో కలసి కేక్‌ కట్‌ చేస్తున్నారా? నేను బాగా చదవాలని గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించండి. తమ్ముడు అల్లరి చేసినా ఏమీ అనకండి’’ అంటూ విదేశీ గడ్డ నుంచి తల్లి దండ్రులను ఫోన్లో పలకరించిన ఆ స్వరం కొన్ని గంటలకే మూగబోయింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తెలంగాణ బిడ్డ కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. సిడ్నీ నగరంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మల్లెపల్లి రక్షిత (22) దుర్మరణం పాలైంది. ఆమె మరణవార్త కుటుంబ సభ్యులకు శనివారం అందింది.

యూనివర్సిటీకి వెళ్తుండగా...
నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మల్లెపల్లి వెంకట్‌రెడ్డి, అనిత దంపతులకు కుమార్తె రక్షిత, కుమారుడు అక్షత్‌ ఉన్నాడు. మాజీ సైనికోద్యోగి అయిన వెంకట్‌రెడ్డి డీఆర్‌డీవోలో చేరడంతో కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలంలోని కేశవరెడ్డి కాలనీ జీఎంఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. రక్షిత హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేయగా ఆమె తమ్ముడు అక్షత్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రక్షిత ఉన్నత చదువుల కోసం 2019 నవంబర్‌ 19న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లింది.

ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతోంది. అయితే నూతన సంవత్సర రోజున ఆమె స్కూటీపై యూనివర్సిటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో మాత్రం వెంటనే తెలియరాలేదు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న ఆమె బంధువులు తండ్రి వెంకట్‌రెడ్డికి శనివారం ఫోన్‌ చేసి చెప్పారు. కుమార్తె పరిస్థితి తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌ వస్తానని చెప్పి అంతలోనే దూరమయ్యావా అంటూ విలపించారు. ఇంతటి దుఃఖంలోనూ వారు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రక్షిత అవయవాలను ఇతరులకు దానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ అంగీకారాన్ని ఆస్పత్రికి తెలియజేశారు. కాగా, రక్షిత మృతదేహన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు